
సెహ్వాగ్ తరువాత మురళీ విజయ్!
ముంబై: భారత క్రికెట్ చరిత్రలో ఘనమైన చరిత్ర ఉన్న నగరంలోని వాంఖేడ్ స్టేడియంలో ఇప్పటివరకూ నమోదైన టెస్టు సెంచరీల సంఖ్య మరీ ఎక్కువేమీ కాదు. 1975లో తొలిసారి అంతర్జాతీయ టెస్టు మ్యాచ్కు వేదికైన ఈ స్టేడియంలో ఇప్పటివరకూ 38 టెస్టు సెంచరీలు నమోదయ్యాయి. అందులో భారత ఆటగాళ్లు 22 సెంచరీలు సాధించారు. అయితే ఓపెనర్లలో అత్యధికంగా ఇక్కడ సెంచరీలు చేసింది మాత్రం భారత మాజీ దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్. ఈ స్టేడియంలో గవాస్కర్ ఓపెనర్ గా చేసిన సెంచరీల సంఖ్య 5.
ఇదిలా ఉంచితే భారత ఓపెనర్గా 2002లో చివరిసారిగా వీరేంద్ర సెహ్వాగ్ ఇక్కడ టెస్టు సెంచరీ సాధించాడు. ఆ తరువాత ఇంత కాలానికి భారత ఓపెనర్ గా మురళీ విజయ్ ఆ మార్కును చేరాడు. దాదాపు 14 ఏళ్ల తరువాత ఒక భారత ఓపెనర్ ఇక్కడ సెంచరీ చేయడం ఇదే ప్రథమం. కాగా, గడిచిన ఇరవై ఏళ్ల కాలంలో సెహ్వాగ్, మురళీ విజయ్లు మాత్రమే భారత ఓపెనర్లుగా సెంచరీలు నమోదు చేసినవారు. ఇంగ్లండ్ తో ఇక్కడ జరుగుతున్న మురళీ విజయ్ సెంచరీ సాధించిన సంగతి తెలిసిందే. 231 బంతుల్లో8 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో శతకం సాధించాడు.