
శతక్కొట్టిన విజయ్
ముంబై:ఇంగ్లండ్తో ఇక్కడ వాంఖేడ్ స్టేడియంలో జరుగుతున్న నాల్గో టెస్టు తొలి ఇన్నింగ్స్లో టీమిండియా ఓపెనర్ మురళీ విజయ్ శతకం సాధించాడు. 231 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో సెంచరీ నమోదు చేశాడు. 146/1 ఓవర్ నైట్ స్కోరు మూడో రోజు భారత్ తొలి ఇన్నింగ్స్ ను కొనసాగిస్తోంది. దీనిలో భాగంగా ఓవర్ నైట్ ఆటగాడు మురళీ విజయ్ శతకం పూర్తి చేసుకోగా, మరో ఓవర్ నైట్ ఆటగాడు చటేశ్వర పూజారా(47) హాఫ్ సెంచరీని తృటిలో కోల్పోయాడు.
ఇన్నింగ్స్ ఆరంభించిన రెండో బంతికే పూజారాను బాల్ బౌల్డ్ చేశాడు. దాంతో భారత్ జట్టు 146 పరుగుల వద్దే రెండో వికెట్ను నష్టపోయింది. ఈ తరుణంలో విజయ్కు జతకలిసిన కెప్టెన్ విరాట్ కోహ్లి సమయోచితంగా ఆడుతూ స్కోరును ముందుకు తీసుకెళుతున్నాడు. ఈ క్రమంలోనే విజయ్ తన టెస్టు కెరీర్లో ఎనిమిదో సెంచరీ నమోదు చేశాడు. దాంతో భారత్ 72.0 ఓవర్లు ముగిసే సరికి రెండు వికెట్ల నష్టానికి 216 పరుగులు చేసింది. ఈ సిరీస్ తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్లో విజయ్ సెంచరీ సాధించిన సంగతి తెలిసిందే.