
అది నా చేతుల్లో లేదు: మురళీ విజయ్
న్యూఢిల్లీ: భారత క్రికెట్ టెస్టు జట్టులో అత్యంత నిలకడగా బ్యాటింగ్ చేసే ఆటగాళ్లలో ఓపెనర్ మురళీ విజయ్ ఒకడు. అయితే ఇటీవల కాలంలో మురళీ విజయ్ రిజర్వ్ బెంచ్ కే ఎక్కువ పరిమితమవుతున్నాడు. మూడు ఫార్మాట్లలో కీలక ఆటగాడిగా గుర్తింపు తెచ్చుకోవాలని మురళీ విజయ్ అనుకుంటున్నా, ఆ మేరకు జట్టులో మాత్రం స్థానం సంపాదించలేకపోతున్నాడు. ఒకవైపు గాయాల బారిన పడుతుండటమే కాకుండా, అన్నిఫార్మాట్లకు సరిపోయే ఆటగాడిగా మాత్రం విజయ్ ఇంకా గుర్తింపు తెచ్చుకోలేకపోయాడు. 'భారత క్రికెట్ జట్టు తరపున అన్ని ఫార్మాట్లలో ఆడాలనేది నా కోరిక. దాని ప్రకారమే నా ఆట తీరును ఎప్పటికప్పుడూ మార్చుకుంటూనే ఉన్నా. అయితే సెలక్షన్ కమిటీ అనేది నా చేతుల్లో లేదు. నా స్కిల్ను పెంచుకోవడంతో పాటు ఫిట్నెస్ను కాపాడుకోవడంపైనే దృష్టి సారించడమే నా పని. ఇప్పటికే టెస్టు ఫార్మాట్లోనన్ను నేను నిరూపించుకున్నప్పటికీ, ఇంకా నిలకడగా ఆడటం కోసం యత్నిస్తున్నా'అని విజయ్ పేర్కొన్నాడు.
ఇదిలా ఉంచితే, భారత కెప్టెన్ విరాట్ కోహ్లిపై మురళీ విజయ్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఏ పరిస్థితుల్లోనైనా చక్కటి ప్రణాళిక అనేది విరాట్ సొంతమని విజయ్ కొనియాడాడు. క్లిష్ట పరిస్థితుల్లో కూడా విరాట్ చాకచక్యంగా వ్యవహరించి జట్టును కాపాడే తీరు నిజంగా అద్భుతమన్నాడు. మూడు ఫార్మాట్లలో సత్తా చాటిన ఏకైక క్రికెటర్ ఎవరైనా ఉన్నారంటే అది విరాట్ కోహ్లినేనని విజయ్ పేర్కొన్నాడు.