విజేత ట్రోఫీతో డీపీఎస్ ఫుట్ బాల్ జట్టు
సాక్షి, హైదరాబాద్: సీబీఎస్‌ఈ క్లస్టర్ ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్‌లో ఆతిథ్య ఢిల్లీ పబ్లిక్ స్కూల్ (డీపీఎస్) నాచారం జట్టు సత్తా చాటింది. మూడు రోజుల పాటు జరిగిన ఈ టోర్నీలో విజేతగా నిలిచి టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఆదివారం జరిగిన అండర్–19 బాలుర ఫైనల్లో డీపీఎస్ నాచారం జట్టు 6–5తో కాకతీయ పబ్లిక్ స్కూల్‌పై విజయం సాధించింది. భవన్స్ శ్రీరామకృష్ణ విద్యాలయ, ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ జట్లు సంయుక్తంగా మూడోస్థానంలో నిలిచాయి.
మరోవైపు అండర్–17 బాలుర ఫైనల్లో నేవీ చిల్డ్రన్ స్కూల్ 2–0తో ఆర్మీ పబ్లిక్ స్కూల్ గోల్కొండను ఓడించి చాంపియన్‌గా నిలిచింది. ఈ విభాగంలో హెచ్‌పీఎస్ రామంతాపూర్, డీపీఎస్ ఖాజాగూడ జట్లు సంయుక్తంగా మూడోస్థానాన్ని దక్కించుకున్నాయి. పోటీల అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో శాట్స్ చైర్మన్ ఎ. వెంకటేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు ట్రోఫీలను అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఫుట్‌బాల్ సంఘం అధ్యక్షులు మొహమ్మద్ అలీ రఫాత్, డీపీఎస్ చైర్మన్ కొమురయ్య, ప్రిన్సిపల్ సునీత తదితరులు పాల్గొన్నారు.