జోహన్నెస్బర్గ్ : నా దృష్టిలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఎప్పుడు ఒక ఉన్నతస్థానంలోనే ఉంటాడని దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ ఏబీ డివిలియర్స్ పేర్కొన్నాడు. ఎంతమంది క్రికెటర్లు వచ్చినా సచిన్ తర్వాతే ఉంటారని ఎందుకంటే మాలాంటి ఎందరికో క్రికెట్‌లో అడుగుపెట్టేందుకు అనువైన బాటలు వేశాడని ఏబీ తెలిపాడు. సోమవారం రాత్రి జింబాబ్వే మాజీ క్రికెటర్ పుమెలే బాంగ్వా నిర్వహించిన ఇన్‌స్టా లైవ్ చాట్‌లో పాల్గొన్న డివిలియర్స్ అభిమానులడిగిన ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు చెప్పాడు. ముందుగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి, ఆసీస్ ఆటగాడు స్టీవ్ స్మిత్‌లలో ఎవరిని ఫేవరెట్‌గా పేర్కొంటారని అభిమానులు అడిగారు. దానికి ఏబీ డివిలియర్స్ విభిన్న శైలిలో స్పందించాడు. (ఆ వివాదంలోకి ధోనిని లాగారు.. కానీ)
'ఇది చాలా క్లిష్టమైన ప్రశ్న. నా దృష్టిలో ఇద్దరు గొప్ప ఆటగాళ్లే... అయితే ఆటలో ఒకరిది దూకుడు స్వభావం అయితే.. మరొకరిది మృదువైన స్వభావంలా ఉంటుంది. దీనిని మీకు టెన్నిస్ ఫార్మాట్‌లో వివరిస్తా.. విరాట్‌ను టెన్సిస్ స్టార్ ఫెదరర్ అనుకుంటే.. స్మిత్‌ను మరొక స్టార్ రఫెల్ నాదల్ అనుకుందా. నాదల్ లానే స్టీవ్ స్మిత్ కూడా క్రీజులో ఎక్కువసేపు ఉండడానికి ప్రయత్నిస్తాడు. మొదట పరుగులు రాకపోయినా గంటల కొద్ది క్రీజులో పాతుకుపోవడంతో నత్తనడకన ఇన్నింగ్స్ ఆరంభించినా భారీ స్కోర్లు సాధించి ఎన్నో రికార్డులు కొల్లగొట్టాడు. కానీ విరాట్ అలా కాదు.. వచ్చీ రావడంతో మొదటి రెండు ఓవరల్లోనే పరిస్థితులను తన పరిధిలోకి తెచ్చుకొని షాట్లు ఆడుతాడు. అతను ఆడేటప్పుడు నాచురల్ షాట్లు ఆడిన ఫీలింగ్ కలుగుతుంది. స్మిత్‌తో పోలిస్తే విరాట్ ప్రపంచంలోని ప్రతీ మైదానంలో పరుగులు సాధించాడు గనుక నేను కోహ్లినే ఫేవరెట్ అని చెబుతాను. అందుకు నేను కోహ్లినే ఫేవరెట్‌గా ఎంచుకొంటానంటూ ' ఏబీ తెలిపాడు.
('భజ్జీ అంటే భయపడిపోయేవారు')
అయితే ఈసారి కోహ్లి, సచిన్ టెండూల్కర్‌లలో ఎవరు మీ ఫేవరెట్ అని అభిమానులు ఏబీని ప్రశ్నించగా.. ' అందులో చెప్పేదేముంది.. కోహ్లికి, నాకు సచిన్ రోల్ మోడల్.. అతని ఆటతీరుని చూస్తూ పెరిగాం. మాస్టర్ ఒక క్రికెటర్‌గా ఏం సాధించాలో అన్నీ సాధించాడు. అతని ఫుట్‌వర్క్, బాడీ టైమింగ్ ఇప్పటి తరంలో ఏ ఆటగాడికి సాధ్యం కాదు. క్రికెట్‌లో అనితరసాధ్యమైన రికార్డులన్నింటిని తన పేరిట లిఖించుకున్నాడు. డెఫినెట్‌గా నా దృష్టిలో మాస్టరే ఫేవరెట్. విరాట్‌ను సచిన్‌తో పోల్చి చెప్పడం అంటే కష్టమే కానీ ఒక విషయంలో మాత్రం సచిన్ కంటే విరాట్ మెరుగ్గా ఉంటాడు. అదే చేజింగ్. ఈ ఒక్క విషయంలో మాత్రం విరాట్ రికార్డును ఎవరు అందుకోలేరు. చేజింగ్‌లో ఎంత పెద్ద స్కోరు ఉన్నా అది కోహ్లి ముందు దిగదిడుపే. సచిన్ కూడా ఇన్నింగ్స్ చేజింగ్‌లో ఒత్తిడికి లోనయ్యి ఔటైన సందర్భాలు చాలానే ఉన్నాయి. కానీ విరాట్ మాత్రం చేజింగ్ అంటే ఎక్కడ లేని ఉత్సాహం కనబడుతుంది. అతని సెంచరీల్లో ఎక్కువబాగం చేజింగ్‌లో వచ్చినేవనన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదంటూ' చెప్పుకొచ్చాడు. ఏబీ డివిలియర్స్ దక్షిణాఫ్రికా తరపున 114 టెస్టులు, 228 వన్డేలు, 78 టీ20లు ఆడాడు. ఐపీఎల్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లితో కలిసి ఏబీ డివిలియర్స్ రాయల్ చాలెంజర్స్ బెంగుళూరుకు ఆడిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment