న్యూఢిల్లీ: ఇటీవల ముగిసిన ఆసియా చాంపియన్ షిప్‌లో బాక్సర్ల అద్భుత ప్రదర్శన (రెండు స్వర్ణాలు, నాలుగు రజతాలు, ఏడు కాంస్యాలు సహా 13 పతకాలు)తో భారత బాక్సింగ్ సమాఖ్య (బీఎఫ్‌ఐ) నూతనోత్సాహంతో ఉంది. ఈ ఫలితాలతో టోక్యో ఒలింపిక్స్ లక్ష్యంగా సమాఖ్య ప్రణాళికలు వేస్తోంది. చాంపియన్‌షిప్ పతకాల్లో కొన్నింటినైనా వచ్చే ఏడాది జరిగే టోక్యో ఒలింపిక్స్‌లో నిలబెట్టుకోవాలని భావిస్తోంది. తమ తదుపరి లక్ష్యం ఇదేనని సమాఖ్య అధ్యక్షుడు అజయ్ సింగ్ ప్రకటించారు. ఇందులో భాగంగా విదేశీ పర్యటనలకు షెడ్యూల్‌కు పది రోజుల ముందే ఆటగాళ్లను పంపనుంది. వాతావరణ మార్పుల కారణంగా ఆహారానికి ఇబ్బంది రాకుండా చెఫ్‌లను పంపించే యోచన చేస్తోంది. సెప్టెంబరులో జరుగనున్న ప్రపంచ చాంపియన్‌షిప్‌తో ఒలింపిక్స్ అర్హత ప్రక్రియ ప్రారంభమవుతుంది. ‘ప్రతిష్ఠాత్మక క్రీడలకు బాక్సర్లను సర్వసన్నద్ధం చేసేందుకు ప్రయత్నిస్తాం. ఏ ఒక్క అవకాశాన్నీ వదలం. ఇందులో భాగంగా మార్గదర్శకం, కోచింగ్, పోషకాహారం ఇలా ప్రతి అంశంపై శ్రద్ధ చూపుతాం’ అని మంగళవారం బాక్సర్ల సన్మాన కార్యక్రమంలో అజయ్ సింగ్ అన్నారు. ‘ఆసియా’ ప్రదర్శనకు గాను బాక్సర్లు, కోచ్‌లను ఆయన ప్రశంసించారు.
‘అర్జున’కు అమిత్, గౌరవ్ పేర్లు
జకార్తా ఆసియా క్రీడల 49 కేజీల విభాగంలో, ఆసియా చాంపియన్‌షిప్ 52 కేజీల విభాగంలో స్వర్ణ పతకాల విజేత అమిత్ పంఘాల్.... 2017 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాంస్యం సాధించిన గౌరవ్ బిధురి పేర్లను బీఎఫ్‌ఐ మంగళవారం ‘అర్జున అవార్డు’కు ప్రతిపాదించింది. వీరిలో అమిత్ పేరును గతేడాది కూడా పరిశీలనకు పంపారు. 2012లో డోప్ టెస్టులో విఫలమై ఏడాది నిషేధానికి గురైన నేపథ్యంలో అతడికి పురస్కారం దక్కలేదు. ఈ వివాదం సమసిన తర్వాత అమిత్ కామన్వెల్త్ క్రీడల్లో రజతం నెగ్గాడు. మహిళల సహాయ కోచ్ సంధ్య గురుంగ్, మాజీ చీఫ్ కోచ్ శివ్ సింగ్‌లను ‘ద్రోణాచార్య’ అవార్డులకు ప్రతిపాదించారు.
ఇక... ఇండియన్ బాక్సింగ్ లీగ్
దేశంలో క్రికెట్ సహా అనేక క్రీడా లీగ్‌లు విజయవంతమైన నేపథ్యంలో త్వరలో ‘ఇండియన్ బాక్సింగ్ లీగ్’ తెరపైకి రానుంది. రెండేళ్లుగా చర్చలు జరుగుతున్న ఈ లీగ్‌కు కార్యరూపం ఇచ్చి ఈ ఏడాది జులై–ఆగస్టు మధ్య నిర్వహించేలా బీఎఫ్‌ఐ ప్రణాళికలు వేస్తోంది. భారత మేటి బాక్సర్లు అమిత్ పంఘాల్, శివ థాపా, సరితా దేవి సహా విదేశీయులు కూడా పాల్గొనే లీగ్‌ను పురుషులు, మహిళల విభాగాల్లో మూడు నుంచి నాలుగు వారాల పాటు నిర్వహించనున్నట్లు స్పోర్ట్జ్‌లైవ్ సంస్థ ఎండీ అతుల్ పాండే తెలిపారు. ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్‌ను ప్రారంభించిన ఈ సంస్థే... బాక్సింగ్ లీగ్ బాధ్యతలూ చూడనుంది.
ఒలింపిక్స్‌కు మరింత పకడ్బందీగా...
Published Wed, May 1 2019 1:25 AM | Last Updated on Wed, May 1 2019 1:25 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment