ఇంగ్లండ్ కు కష్టకాలమే!
ఒకవైపు భద్రతా సమస్యలతో ఇంగ్లండ్ జట్టు సతమతమవుతుంటే.. మరోవైపు ఆ జట్టు ఆటగాళ్లను గాయాల సమస్యలు వెంటాడుతున్నాయి. ఇంగ్లండ్ బౌలర్లు జేమ్స్ అండర్సన్, మార్క్ వుడ్ గాయాల కారణంగా బంగ్లాదేశ్ టూర్ నుంచి తప్పుకున్నారని ఇంగ్లండ్, వేల్స్ క్రికెట్ బోర్డు గురువారం ఈ విషయాన్ని వెల్లడించాయి. గత ఆగస్టులో పాక్ తో జరిగిన నాలుగో టెస్టు తర్వాత నుంచి భుజం గాయంతో ఇబ్బంది పడుతున్నాడు. మరో పేసర్ వుడ్ చీలమండ గాయం కారణంగా బంగ్లా టూర్ నుంచి తప్పుకున్నాడు.
టెస్టుల్లో ఇంగ్లండ్ తరఫున అత్యధిక వికెట్ల వీరుడు అండర్సన్ లేకపోవడం ఆ జట్టుకు ప్రతికూల అంశం. ఈ మధ్య కాలంలో బంగ్లా జట్టును ఏ ప్రత్యర్థి తక్కువగా అంచనా వేయడం లేదు. తమదైన రోజున బంగ్లా ఏ జట్టుకైనా షాక్ ఇచ్చేందుకు వెనకాడదు. ఇంగ్లండ్ జట్టు వచ్చే నెలలో బంగ్లాదేశ్ లో మూడు వన్డేలు, రెండు టెస్టుల పర్యటన నమిత్తం బంగ్లాలో పర్యటించనుంది. అయితే ఈ ఏడాది జూలైలో ఢాకాలో జరిగిన ఉగ్రదాడుల్లో దాదాపు 18 మంది విదేశీయులు ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో మొదట ఇంగ్లండ్ వెనుకంజ వేసింది. అయితే ఇంగ్లండ్ జట్టుకు పూర్తిస్థాయి భద్రత కల్పిస్తామంటూ బంగ్లా క్రికెట్ బోర్డు హామీ ఇవ్వడంతో పర్యటనకు అంతా సిద్ధమయ్యారు. అక్టోబర్ 20న తొలి టెస్టు ప్రారంభంకానుంది.