ఇంగ్లండ్ క్రికెటర్లకు డెడ్లైన్!
మాంచెస్టర్: త్వరలోబంగ్లాదేశ్ పర్యటనకు సంబంధించి ఇటీవలే ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) క్లియరెన్స్ ఇవ్వడం ఆ దేశ క్రికెటర్లకు సరికొత్త తలనొప్పులు తెచ్చిపెట్టేలా ఉంది. బంగ్లాదేశ్ పర్యటనకు ఎవరైనా విముఖత చూపితే, భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకోవాల్సి రావొచ్చని ఆ జట్టు డైరెక్టర్ ఆండ్రూ స్ట్రాస్ వార్నింగ్ ఇచ్చాడు. ఈ మేరకు బంగ్లాదేశ్ పర్యటనకు వచ్చే ఆటగాళ్లకు మూడు రోజల డెడ్లైన్ విధిస్తూ ఆదేశాలు జారీ చేశాడు.
'ఈ విషయాన్ని ప్రతీ క్రికెటర్ గుర్తించుకోవాలి. బంగ్లాదేశ్ టూర్ రిస్క్ అని భావించి ఎవరైనా అనుకుంటే మూడు రోజుల్లో మాకు తెలియజేయాలి. ఆ స్థానంలో వేరే క్రికెటర్ను పంపుతాం. ఒకవేళ ఆ పర్యటనకు వెళ్లిన క్రికెటర్లు రాణిస్తే, వెళ్లని క్రికెటర్లకు రానున్న రోజుల్లో రిస్క్ తప్పదు. 'అని స్ట్రాస్ స్పష్టం చేశాడు.
ఈ పర్యటనకు టెస్టు కెప్టెన్ అలెస్టర్ కుక్తో పాటు, మొయిన్ అలీ, క్రిస్ జోర్డాన్లు ఇప్పటికే అంగీకారం తెలిపారు. కాగా, వన్డే కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ మాత్రం బంగ్లా పర్యటనపై ఇంకా తన నిర్ణయాన్ని తెలియజేయాల్సి ఉంది. దీనిలో భాగంగా మోర్గాన్ కు ఆండ్రూ స్ట్రాస్ హితబోధ చేశాడు. ఒకవేళ మోర్గాన్ అక్కడి వెళ్లాలనుకుంటే అనవసర భయాలు వదిలి పూర్తి దృష్టంతా క్రికెట్ పైనే సారించాల్సిన అవసరం ఉందన్నాడు. అలా చేసిన పక్షంలోనే జట్టుకు లాభం చేకూరుతుందదంటూ స్ట్రాస్ పరోక్షంగా హెచ్చరించాడు.