తమతో ద్వైపాక్షిక సిరీస్ ఆడమని ఇక భారత్‌ను అడిగే ప్రసక్తే లేదని పాక్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చైర్మన్ షహర్యార్ ఖాన్ స్పష్టం చేశారు
కరాచీ : తమతో ద్వైపాక్షిక సిరీస్ ఆడమని ఇక భారత్‌ను అడిగే ప్రసక్తే లేదని పాక్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చైర్మన్ షహర్యార్ ఖాన్ స్పష్టం చేశారు. సిరీస్ గురించి చాలా రకాలుగా చెప్పి చూశామన్నారు. ‘డిసెంబర్‌లో జరగాల్సిన సిరీస్ గురించి ఇక అడగదల్చుకోలేదు. బంతి బీసీసీఐ కోర్టులో ఉంది. కాబట్టి సిరీస్ భవితవ్యాన్ని తేల్చాల్సింది వాళ్లే. మా వైపు నుంచి సాధ్యమైనంత వరకు ప్రయత్నించి చూశాం. కానీ స్పందన లేదు. అయితే మేం బీసీసీఐకి పంపిన లేఖకు ఏం జవాబు ఇస్తారో చూడాలని అనుకుంటున్నాం’ అని ఖాన్ పేర్కొన్నారు.
ఈ సిరీస్‌లో భారత్ ఆడకపోతే అవసరమైనప్పుడు ఐసీసీతో ఈ విషయాన్ని చర్చిస్తామన్నారు. క్రికెట్, రాజకీయాలను కలిపి చూడొద్దని ఇప్పటికీ తాము స్పష్టంగా చెబుతున్నామని ఖాన్ తెలిపారు. ‘గతంలో రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఉన్నా క్రికెట్ ఆడాం. కానీ 2007 నుంచి భారత్ మాతో ఒక్క టెస్టు కూడా ఆడలేదు. అయినప్పటికీ మేం వాళ్ల వెంట పరుగెత్తలేదు. ద్వైపాక్షిక సిరీస్‌కు ఉన్న ప్రాముఖ్యతను బట్టి వాటిని పునరుద్ధరించాలని మాత్రం అడిగాం’ అని ఖాన్ వ్యాఖ్యానించారు.