విశాఖ: టీమిండియా కెప్టెన్, పరుగుల మెషీన్ విరాట్ కోహ్లి ఫీల్డ్‌లో అంత దూకుడుగా ఉండటానికి కారణం ఏంటో తెలుసుకోవాలని ఉందని అంటున్నాడు వెస్టిండీస్ కెప్టెన్ కీరోన్ పొలార్డ్. రికార్డుల మీద రికార్డులు కొల్లగొడుతూ ప్రపంచ క్రికెట్‌లో దూసుకుపోతున్న కోహ్లి ఆన్ ఫీల్డ్‌లో దూకుడుగా ఉండటం మనకు తెలిసిందే. అయితే దీనిపై తనకు క్లారిటీ కావాలని అంటున్నాడు పొలార్డ్. తొలి వన్డేలో రవీంద్ర జడేజా రనౌట్ అయిన విషయంలో కోహ్లి జోక్యం చేసుకోవడాన్ని కానీ టీ20 సిరీస్‌లో భాగంగా రెండో టీ20లో విండీస్ బౌలర్ కెస్రిక్ విలియమ్స్ ‘నోట్ బుక్’ సెలబ్రేషన్‌న్‌ను కోహ్లి వెక్కిరించడాన్ని ఇక్కడ పొలార్డ్ పరోక్షంగా ప్రస్తావించాడు.
అసలు ఆన్‌ఫీల్డ్‌లో కోహ్లికి అంత ఉత్సాహం ఎందుకో తెలుసుకోవాలని ఆత్రంగా ఉందన్నాడు. ‘ కోహ్లి అత్యుత్సాహానికి నాకు జవాబు అయితే తెలీదు. ఎప్పుడూ అంత దూకుడుగా ఎందుకు ఉంటాడో తెలుసుకోవాలని ఉంది. అలా ఎందుకు అంత ఉత్సుకతతో ఉంటాడో కోహ్లిని మీరే అడగండి. నాకైతే తెలీదు. అతన్ని ఈ ప్రశ్న అడిగి జవాబు తెలుసుకోండి. ఎందుకంటే నాకు తెలుసుకోవాలని ఉంది’ అని పొలార్డ్ పోస్ట్ మ్యాచ్ కాన్పరెన్స్‌లో పేర్కొన్నాడు.
రెండో వన్డేలో భారత్ నిర్దేశించిన 388 పరుగుల టార్గెట్‌ను ఛేదించడంలో విండీస్ పూర్తిగా విఫలమైంది. 280 పరుగులకే పరిమతం కావడంతో టీమిండియా 107 పరుగుల తేడాతో విజయం సాధించింది. షాయ్ హోప్(78), నికోలస్ పూరన్(75)లు హాఫ్ సెంచరీలు ఆదుకున్నప్పటికీ భారీ లక్ష్యం కావడంతో విండీస్‌కు ఓటమి తప్పలేదు.
Comments
Please login to add a commentAdd a comment