విశాఖ: టీమిండియాతో జరుగుతున్న రెండో వన్డేలో వెస్టిండీస్ కెప్టెన్, ఆల్ రౌండర్ కీరోన్ పొలార్డ్ ఇలా వచ్చి అలా పెవిలియన్ చేరాడు. నికోలస్ పూరన్(75; 47 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్‌కు బ్రేక్ పడిన తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన పొలార్డ్ ఆడిన తొలి బంతికే పెవిలియన్ చేరాడు. మహ్మద్ షమీ వేసిన 30 ఓవర్ రెండో బంతికి పూరన్ ఔట్ కాగా, ఆ మరుసటి బంతికి పొలార్డ్ ఔటయ్యాడు. ఆఫ్ స్టంప్‌పైకి వేసిన గుడ్ లెంగ్త్ బాల్‌ను ఆడబోయిన పొలార్డ్.. అది కాస్తా ఎడ్జ్ తీసుకోవడంతో కీపర్ రిషభ్ పంత్ చేతుల్లో పడింది. దాంతో పొలార్డ్ ఇన్నింగ్స్ సున్నాకే ముగిసింది.
అంతకుముందు పూరన్ ధాటిగా బ్యాటింగ్ చేసి విండీస్ స్కోరు బోర్డును పరుగులు తీయించాడు. అతని వ్యక్తిగత స్కోరు 22 పరుగుల వద్ద ఉండగా జడేజా బౌలింగ్‌లో ఇచ్చిన క్యాచ్‌లను దీపక్ చాహర్ వదిలేయడంతో బతికిపోయిన పూరన్ రెచ్చిపోయాడు. అయితే బ్యాట్ ఝుళిపించే క్రమంలో షమీ తెలివిగా బౌన్స్ వేయగా దాన్ని పూరన్ హిట్ చేశాడు. అది కాస్తా లాంగ్ లెగ్‌లో క్యాచ్‌గా లేవడంతో అక్కడకు కాస్త దూరంలో ఫీల్డింగ్ చేస్తున్న కుల్దీప్ యాదవ్ దాన్ని పరుగెత్తుకుంటూ వచ్చి అందుకున్నాడు. దాంతో పూరన్ భారంగా పెవిలియన్ చేరాడు. ఆపై క్రీజ్‌లోకి వచ్చిన పొలార్డ్‌ను చక్కటి బంతితో షమీ బోల్తా కొట్టించాడు. వెంటవెంటనే రెండు వికెట్లు సాధించడంతో టీమిండియా శిబిరంలో ఆనందంలో మునిగిపోయింది. కాగా, వన్డే చరిత్రలో ఒకే మ్యాచ్‌లో ఇద్దరు కెప్టెన్లు గోల్డెన్ డక్‌గా వెనుదిరగడం ఇదే తొలిసారి.
టీమిండియా ఇన్నింగ్స్‌లో కెప్టెన్ విరాట్ కోహ్లి కూడా ఆడిన తొలి బంతికే పెవిలియన్ చేరి గోల్డెన్ డక్ అయ్యాడు. ఆ వికెట్‌ను పొలార్డ్ సాధించాడు. పొలార్డ్ వేసిన స్లో బౌన్సర్‌ను పుల్ చేయబోయి కోహ్లి డకౌట్ అయ్యాడు. ఈ మ్యాచ్‌లో భారత్ జట్టు నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 387 పరుగులు చేసింది. రోహిత్ శర్మ(159), కేఎల్ రాహుల్(102)లు సెంచరీలు చేయగా, శ్రేయస్ అయ్యర్(53), పంత్(39)లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. ఆ తర్వాత విండీస్ ఇన్నింగ్స్ ఆరంభించగా 61 పరుగుల వద్ద లూయిస్(30) వికెట్‌ను కోల్పోయింది.
ఆపై స్వల్ప వ్యవధిలో హెట్‌మెయిర్(4), రోస్టన్ ఛేజ్(4)లు ఔట్ కావడంతో టీమిండియా పట్టుబిగించింది. కాగా, షాయ్ హోప్, పూరన్‌లు 106 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించడంతో టీమిండియాలో కాస్త అలజడి రేగింది. పూరన్ ఔటైన తర్వాత కాస్త ఊపిరి తీసుకున్న టీమిండియా.. పొలార్డ్‌కు డక్‌గా ఔట్ కావడంతో మ్యాచ్‌ను దాదాపు అధీనంలోకి తెచ్చుకుంది. 33 ఓవర్లు ముగిసే సరికి విండీస్ ఎనిమిది వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. షాయ్ హోప్(78) ఆరో వికెట్‌గా ఔట్ కాగా, ఆ తదుపరి బంతికి జాసన్ హెల్డర్(11) ఔటయ్యాడు. అటు వెంటనే జోసెఫ్(0)సైతం గోల్డెన్ డక్‌గా పెవిలియన్ చేరాడు. దాంతో కుల్దీప్ యాదవ్ హ్యాట్రిక్ సాధించాడు.
Comments
Please login to add a commentAdd a comment