ఖాళీ మైదానంలో తలపడుతున్న ఆస్టన్ విల్లా, షెఫీల్డ్ యునైటెడ్ జట్లు
మాంచెస్టర్: కరోనా విరామం తర్వాత ఎట్టకేలకు ఒక ప్రతిష్టాత్మక క్రీడా ఈవెంట్ మళ్లీ వచ్చింది. స్టేడియంలో ప్రేక్షకులు లేకుండా బుధవారం ఇంగ్లీష్ ప్రీమియర్ పోటీలు మళ్లీ ప్రారంభమయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో అభిమానులు, స్టార్ ఆటగాళ్లు ఉన్న లీగ్ కావడంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఈ లీగ్‌లో మార్చి 8న చివరి మ్యాచ్ జరిగింది. పునఃప్రారంభంలో బర్మింగ్‌హామ్‌లో జరిగిన పోరులో ఆస్టన్ విల్లాతో షెఫీల్డ్ యునైటెడ్ తలపడింది. కోవిడ్–19కు సంబంధించిన అన్ని నిబంధనలను మైదానాల్లో పాటిస్తూ మ్యాచ్‌లు నిర్వహించుకునేందుకు ఇంగ్లండ్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దాంతో అడుగడుగునా పలు జాగ్రత్తలు తీసుకున్నారు. మొత్తంగా ఇదంతా కొత్తగా కనిపించింది. ఈ స్వీయ నియంత్రణ నిబంధనలు ఐపీఎల్ జరిపేందుకు బీసీసీఐకిదారి చూపిస్తున్నట్లుగానే ఉన్నాయి. వాటిలో కొన్నింటిని చూస్తే...
► ఆటగాళ్లు, సిబ్బంది, సెక్యూరిటీ అంతా కలిపి మ్యాచ్ జరిగే సమయంలో స్టేడియంలో 300 మందికి మించి ఉండరాదు
► స్టేడియంను రెడ్, అంబర్, గ్రీన్ జోన్లతో విభజించారు. మ్యాచ్ జరిగే చోటు, డ్రెస్సింగ్ రూమ్, టెక్నికల్ ఏరియా రెడ్‌జోన్‌లో ఉంటాయి. మ్యాచ్‌కు కనీసం ఐదు రోజుల ముందు జరిగిన కోవిడ్ టెస్టులో నెగెటివ్‌గా వచ్చినవారినే రెడ్ జోన్‌లోకి అనుమతిస్తారు.
► మ్యాచ్ ఆడే బంతి, గోల్‌పోస్ట్, డగౌట్లు, కార్నర్ పోల్స్, ఫ్లాగ్స్, సబ్‌స్టిట్యూషన్ బోర్డులు మొత్తం శానిటైజ్ చేస్తారు.
► 20 క్లబ్‌లకు చెందిన ఆటగాళ్లు, సహాయక సిబ్బందికి వారంలో రెండు సార్లు కరోనా టెస్టులు చేస్తారు. ఎవరైనా పాజిటివ్‌గా తేలితే సెల్ఫ్ ఐసోలేషన్‌కు పంపిస్తారు. జట్టు మొత్తాన్ని క్వారంటైన్ చేయరు. కోవిడ్–19 పేషెంట్లకు చికిత్స అందిస్తున్న తరహాలోనే అన్ని ఏర్పాట్లతో ఇద్దరు వైద్యులు మైదానంలో ఉంటారు.
► మైదానంలో ఉమ్మడం, ముక్కు శుభ్రం చేసుకోవడం నిషేధం. గోల్ చేసినప్పుడు కూడా ఆటగాళ్లు దూరం పాటించాలి. షేక్‌హ్యాండ్‌లు చేయరాదు. ప్లేయర్లు మాస్క్ ధరించనవసరం లేదు.
► బాల్ బాయ్స్ ఉండరు. మైదానంలోనే అన్ని వైపుల అదనపు బంతులు పెడతారు. ఆటగాళ్లే వెళ్లి తీసుకోవాలి. ముగ్గురికి బదులు ఐదుగురు సబ్‌స్టిట్యూట్‌లను అనుమతిస్తారు.
► రెండు అర్ధ భాగాల్లోనూ ఒక్కో నిమిషం చొప్పున మాత్రమే డ్రింక్స్ బ్రేక్ ఇస్తారు. ఆటగాళ్లు ఎవరి బాటిల్‌లో నీళ్లు వారే తెచ్చుకొనితాగాలి.
Comments
Please login to add a commentAdd a comment