కోహ్లి గొప్ప నాయకుడు
ఆసీస్ మాజీ ఆటగాళ్ల ప్రశంసలు
మెల్‌బోర్న్: భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లిపై కక్ష కట్టిన ఆస్ట్రేలియా మీడియా తమ అసత్య కథనాలతో విమర్శిస్తున్నా ఆ దేశ మాజీ క్రికెటర్లు మాత్రం అతడిని ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. మైకేల్ క్లార్క్ ఇప్పటికే తన మద్దతు ప్రకటించగా తాజాగా దిగ్గజ ఆటగాళ్లు స్టీవ్ వా, ఆడమ్ గిల్‌క్రిస్ట్ కూడా ఇదే బాటలో పయనించారు. ‘కోహ్లి అద్భుత నాయకుడు. తనతోపాటుగా జట్టును, దేశాన్ని నడిపిస్తున్నాడు. ధర్మశాలలో తన స్థాయికి తగ్గ ఆటతీరును ప్రదర్శిస్తాడేమోనని భయంగా ఉంది. ప్రస్తుత వివాదాన్ని ఇరు జట్లు సామరస్యంగా పరిష్కరించుకోవాలి. 2008 మంకీగేట్‌లా ఇది కాకూడదనే అనుకుంటున్నాను.
2001 అనంతరం జరుగుతున్న అద్భుత సిరీస్ ఇదేనని చాలామంది చెబుతున్నారు’ అని గిల్లీ తెలిపారు. మరోవైపు కోహ్లి కెప్టెన్సీలో తనతోపాటు రికీ పాంటింగ్ లక్షణాలు కనిపిస్తున్నాయని మాజీ కెప్టెన్ స్టీవ్ వా కొనియాడారు. ‘భారత క్రికెట్‌కు అతడు కొత్త ముఖచిత్రం. దూకుడైన కెప్టెన్‌గా చెప్పవచ్చు. జట్టు ఆటగాళ్లతో నిరంతం సంభాషిస్తూ ముందుకెళతాడు. సానుకూల దృక్పథంలో నన్ను గుర్తు చేస్తున్నాడు. పాంటింగ్‌లోనూ ఇలాంటి లక్షణాలే కనిపించేవి’ అని వా అన్నారు.