ఆసీస్ బౌలర్ల ధాటికి సఫారీలు విలవిల
పెర్త్: దక్షిణాఫ్రికా చేతిలో వన్డే సిరీస్‌లో 5-0తో దారుణ ఓటమి చవిచూసిన ఆస్ట్రేలియా టెస్టుల్లో వారిపై ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తోంది. నేడు పెర్త్ లో ఇరు జట్ల మధ్య ప్రారంభమైన తొలి టెస్టులో ఆసీస్ పేసర్లు చెలరేగిపోతున్నారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సఫారీలకు ఆది నుంచే కష్టాలు మొదలయ్యాయి. 32 పరుగులకే సఫారీ జట్టు టపార్డర్ ను పెవిలియన్ బాట పట్టించి, ఆ జట్టును ఆత్మరక్షణలోకి నెట్టేశారు. బ్యాటింగ్ కు దిగిన సఫారీ జట్టు ఇన్నింగ్స్ తొలి ఓవర్లో ఖాతా తెరవకుండానే ఓపెనర్ కుక్ వికెట్ కోల్పోయింది.
తొలి ఓవర్ వేసిన ఆసీస్ పేసర్ స్టార్క్ ఆ ఓవర్ నాలుగో బంతికి కుక్(0) ను ఔట్ చేశాడు. మరో పేసర్ హజెల్ వుడ్ స్టార్ బ్యాట్స్ మన్ హషీం ఆమ్లా(0)ను తెలివైన బంతితో బోల్తా కొట్టించగా కెప్టెన్ స్టీవ్ స్మిత్ కు క్యాచ్ ఇచ్చి డకౌట్ అయ్యాడు. అదే జోరులో సఫారీ ఓపెనర్ ఎల్గర్(12)ను మూడో వికెట్ రూపంలో పెవిలియన్ బాట పట్టించాడు. దాదాపు 9 నెలల తర్వాత గాయాల నుంచి కోలుకుని జట్టులోకొచ్చిన ఆసీస్ పేసర్ సిడిల్ కూడా ఆసీస్ కు బ్రేక్ ఇచ్చాడు. సెకండ్ డౌన్ లో బ్యాటింగ్ కు వచ్చిన జేపీ డుమిని(11) సిడిల్ బౌలింగ్ లో కీపర్ నెవిల్ కు క్యాచ్ ఇచ్చి జట్టు స్కోరు 32 పరుగుల వద్ద నాలుగో వికెట్ రూపంలో వెనుదిరిగాడు. పేసర్లకు అనుకూలించే పెర్త్ పిచ్ పై ఆసీస్ ఫాస్ట్ బౌలర్లు మరింత చెలరేగితే సఫారీలకు కష్టాలు తప్పవు.