కంగారూల చేతిలో కుక్ సేన కుదేలు
అడిలైడ్: యాషెస్ రెండో టెస్టులో ఆస్ట్రేలియా చేతిలో ఇంగ్లండ్ ఘోర పరాజయం పాలయింది. 218 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిపోయింది. ఆస్ట్రేలియా నిర్దేశించిన 531 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి కుక్‌సేన రెండో ఇన్నింగ్స్‌లో 101.4 ఓవర్లలో 312 పరుగులకు ఆలౌటయింది. రూట్(87), ప్రయర్(69), పీటర్సన్(53) అర్థ సెంచరీలు చేసినా మిగతా ఆటగాళ్లు విఫలమవడంతో ఇంగ్లండ్ ఓటమిపాలయింది. ఆసీస్ బౌలర్లలో సిడిల్ 4, హరీస్ 3 వికెట్లు పడగొట్టారు. జాన్సన్, లియన్, స్మిత్ తలో వికెట్ తీశారు.
తొలి ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా స్కోరు 570/9 డిక్లేర్డ్ కాగా, ఇంగ్లండ్ 172 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా జట్టు132/3 వద్దనే రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. మొత్తం 8 వికెట్లు తీసిన ఆసీస్ బౌలర్ జాన్సన్ 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్'గా ఎంపికయ్యాడు. తొలి టెస్టులోనూ ఆస్ట్రేలియా గెల్చిన సంగతి తెలిసింది. తాజా విషయంలో ఐదు టెస్టుల ఈ సిరీస్లో ఆసీస్ 2-0 ఆధిక్యంలో నిలిచింది.