మూడో టైటిల్ లక్ష్యంగా...
►ఆత్మవిశ్వాసంతో ఆస్ట్రేలియా
►పేస్ బౌలర్లే బలం
►బ్యాటింగ్ భారం స్మిత్‌పైనే
నాలుగేళ్ల క్రితం ఇంగ్లండ్‌లో చాంపియన్స్ ట్రోఫీ జరిగినప్పుడు ఆస్ట్రేలియా ఒక్క మ్యాచ్ కూడా గెలవలేకపోయింది. ఇంగ్లండ్, శ్రీలంక చేతిలో ఆ జట్టు ఓడగా... కివీస్‌తో మ్యాచ్ రద్దయింది. అంతకు ముందు వరుసగా రెండు సార్లు విజేతగా నిలిచిన కంగారూలు, ఇంగ్లండ్‌లో స్వింగ్‌కు అనుకూలించిన పరిస్థితుల్లో ఉక్కిరిబిక్కిరయ్యారు. సరిగ్గా రెండేళ్ల తర్వాత ఆ జట్టు సొంతగడ్డపై ప్రపంచకప్ నెగ్గినా... టోర్నీలో ఆ జట్టు ఓడిన ఏకైక మ్యాచ్ కూడా స్వింగ్‌కు అనుకూలించిన ఆక్లాండ్‌లోనే జరిగింది. ఈ సారి అలాంటి పరిస్థితుల్లోనే గ్రూప్ దశలో న్యూజిలాండ్, ఇంగ్లండ్‌లతోనే ఆసీస్ తలపడాల్సి ఉంది. మరి ఆ సవాల్‌ను ఆస్ట్రేలియా అధిగమించగలదా... ఆ దశను దాటి ముచ్చటగా మూడో సారి చాంపియన్‌గా నిలవగలదా అనేది ఆసక్తికరం.
సాక్షి క్రీడా విభాగం
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీని ఆస్ట్రేలియా (2006, 2009) రెండు సార్లు నెగ్గింది. భారత్ ఒకసారి సంయుక్త విజేతగా నిలవడాన్ని మినహాయిస్తే పూర్తి ఆధిపత్యంతో రెండు టైటిల్స్ తమ ఖాతాలో వేసుకున్న ఏకైక జట్టు ఆసీస్. 2013 టోర్నీలో ఆడిన ఆసీస్ ఆటగాళ్లలో నలుగురు మాత్రమే ప్రస్తుత జట్టుతో ఉన్నారు. ఆ టోర్నీలో జట్టులోనే లేని స్టీవ్ స్మిత్, ఈ సారి తన నాయకత్వంతో కంగారూలకు తొలి టైటిల్ అందించాలని పట్టుదలగా ఉన్నాడు. ప్రస్తుతం వన్డే ర్యాంకింగ్స్‌లో రెండో స్థానంలో ఉన్న ఆస్ట్రేలియా తమ స్థాయికి తగ్గ ఆటతీరు కనబరిస్తే చాంపియన్‌గా నిలిచేందుకు అన్ని అవకాశాలు ఉన్నాయి. ఇటీవల ఆ జట్టు దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్‌ల చేతుల్లో ఓడినా... అందులో ద్వితీయ శ్రేణి జట్టునే బరిలోకి దించింది.
ఆ నలుగురు...
చాంపియన్స్ ట్రోఫీలో ఆసీస్ గెలుపోటములు ప్రధానంగా నలుగురు పేసర్లపై ఆధారపడి ఉన్నాయనడంలో సందేహం లేదు. ఒకరితో పోలిస్తే మరొకరు వైవిధ్యాన్ని ప్రదర్శించే మిషెల్ స్టార్క్, హాజల్‌వుడ్, కమిన్స్, ప్యాటిన్సన్ టీమ్‌లో ఉన్నారు. ప్రస్తుత అంచనాల ప్రకారం ప్రతీ మ్యాచ్‌లోనూ ఈ నలుగురు తుది జట్టులో ఉండే అవకాశం ఉంది. ఇంగ్లండ్‌లోని సీమ్, స్వింగ్ పరిస్థితులను వీరు ఎంత సమర్థంగా ఉపయోగించుకుంటారనేదే కీలకం. ప్రతీ ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను దెబ్బ తీయగల సత్తా వీరికుంది. 2015 నుంచి చూస్తే టాప్–8 జట్లపై 67 వికెట్లు తీసిన స్టార్క్ ఈసారి మరింత ప్రమాదకారి కాగలడు. గాయం నుంచి కోలుకొని అతను పూర్తి స్థాయిలో సిద్ధమయ్యాడు. ఇక ఐపీఎల్‌లో భారత్ తరహా పిచ్‌లపైనే కనీసం 145 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేసిన కమిన్స్ కూడా అమితోత్సాహంతో ఉన్నాడు. ‘మేం నలుగురం కలిసి ఆడుతూ కలిసి పెరిగాం. ఒకేసారి కలిసి ఆడే అవకాశం మాత్రం దక్కలేదు. దాని కోసం ఉద్వేగంగా ఎదురుచూస్తున్నాం. మా ప్రదర్శనతో జట్టును గెలిపించడమే లక్ష్యం’ అని స్టార్క్ చెబుతున్నాడు. లెగ్ స్పిన్నర్ ఆడమ్ జంపా జట్టులో ఉన్నా, ఐదో బౌలర్‌గా అతనికి అవకాశాలు ఇవ్వడం సందేహమే.
వార్నర్ చెలరేగుతాడా...
ప్రపంచంలోని ఏ పరిస్థితుల్లోనైనా, ఎలాంటి పిచ్‌పైనా కూడా ప్రస్తుతం చెలరేగిపోగల సామర్థ్యం ఉన్న బ్యాట్స్‌మన్ స్టీవ్ స్మిత్. కెప్టెన్‌గా వ్యూహరచనతో పాటు ఆటగాడిగా అతను ఇప్పుడు ఆసీస్‌కు అమూల్యమైన ఆస్తి. నిజానికి ఇంగ్లండ్‌లో అతని రికార్డు ఏమీ గొప్పగా లేదు. 11 మ్యాచ్‌లలో అతను కేవలం ఒకే అర్ధసెంచరీతో 279 పరుగులు మాత్రమే చేశాడు. అయితే అదంతా గతం. గత రెండేళ్లలో రాటుదేలిన స్మిత్ అద్భుతంగా చెలరేగిపోతున్నాడు. అటు దూకుడుతో పాటు ఇటు మధ్య ఓవర్లలో నియంత్రణతో అతను బ్యాటింగ్ చేయగలడు. మిగతా ఇతర కీలక బ్యాట్స్‌మెన్ వార్నర్, క్రిస్ లిన్, ఫించ్, మ్యాక్స్‌వెల్ విధ్వంసకర ఆటగాళ్లే. అయితే టి20 శైలిని కాస్త పక్కన పెట్టి వీరు అసలైన వన్డే ఇన్నింగ్స్‌లు ఆడితే ఆసీస్‌కు టోర్నీలో మంచి అవకాశాలు ఉన్నాయి. లిన్ కూడా వన్డేల్లో ఇంకా నిరూపించుకోవాల్సి ఉంది. 2015 తర్వాత ఆసీస్ తరఫున వార్నర్ అత్యధికంగా 2,021 పరుగులు చేశాడు. గత ఏడాది కాలంలోనే వార్నర్ 8 సెంచరీలు సాధించినా... ఇంగ్లండ్‌లో అతనికీ పేలవమైన రికార్డు ఉంది. ఇంగ్లండ్ గడ్డపై అతను ఏ ఫార్మాట్‌లో కూడా సెంచరీ సాధించలేకపోయాడు. స్వింగ్ పరిస్థితుల్లో తమ బౌలింగ్‌ను నమ్ముకుంటున్న ఆ జట్టు బ్యాటింగ్ కూడా అలాంటి స్థితినే ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉండాల్సిందే.
►చాంపియన్స్ ట్రోఫీలో ఆస్ట్రేలియా మొత్తం 21 మ్యాచ్‌లు ఆడింది. వాటిలో 12 గెలిచి, 7 ఓడగా మరో 2 మ్యాచ్‌లలో ఫలితం రాలేదు.
జట్టు వివరాలు: స్టీవ్ స్మిత్ (కెప్టెన్), వార్నర్, ఫించ్, క్రిస్ లిన్, మ్యాక్స్‌వెల్, హెడ్, స్టొయినిస్, హెన్రిక్స్, వేడ్ (వికెట్ కీపర్), జంపా, ప్యాటిన్సన్, హేస్టింగ్స్, హాజల్‌వుడ్, స్టార్క్, కమిన్స్.