
కరాచీ: పాకిస్తాన్ క్రికెటర్ బాబర్ అజామ్ అరుదైన ఫీట్‌ను సాధించాడు. సోమవారం కరాచీలో శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో బాబర్ అజామ్ శతకంతో మెరిశాడు. 105 బంతుల్లో 8ఫోర్లు, 4సిక్సర్లతో 115 పరుగులు సాధించాడు. దాంతో వన్డేల్లో 11వ సెంచరీ సాధించాడు. ఈ క్రమంలోనే వేగవంతంగా 11వ శతకాన్ని నమోదు చేసిన జాబితాలో మూడో స్థానానికి ఎగబాకాడు. ఫలితంగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లిని వెనక్కినెట్టేశాడు. బాబర్ అజామ్ 71వ ఇన్నింగ్స్‌లో ఈ ఫీట్ సాధిస్తే, కోహ్లి 82వ ఇన్నింగ్స్‌లో దీన్ని సాధించాడు. ఈ జాబితాలో హషీమ్ ఆమ్లా తొలి స్థానంలో ఉండగా, క్వింటాన్ డీకాక్ రెండో స్థానంలో ఉన్నాడు. ఆమ్లా తన 64వ ఇన్నింగ్స్‌లో 11వ వన్డే సెంచరీని సాధిస్తే, డీకాక్ 65వ ఇన్నింగ్స్‌లు దీన్ని నమోదు చేశాడు.
మరొకవైపు ఈ క్యాలెండర్ ఇయర్‌లో వెయ్యి వన్డే పరుగుల్ని సాధించిన తొలి పాకిస్తాన్ క్రికెటర్‌గా సైతం గుర్తింపు పొందాడు. అదే సమయంలో ఒక క్యాలెండర్ ఇయర్‌లో వేగవంతంగా వెయ్యి పరుగులు సాధించిన పాకిస్తాన్ ఆటగాడిగా కూడా రికార్డును సాధించాడు. ఇక్కడ పాక్ మాజీ కెప్టెన్ జావెద్ మియాందాద్ రికార్డును అజామ్ బ్రేక్ చేశాడు. అజామ్ 19 ఇన్నింగ్స్‌ల్లో ఒక క్యాలెండర్ ఇయర్‌లో వెయ్యి పరుగుల్ని సాధిస్తే, మియాందాద్ 21 ఇన్నింగ్స్‌ల్లో దీన్ని సాధించాడు. 1987లో మియాందాద్ వేగవంతంగా ఆ క్యాలెండర్ ఇయర్‌లో వెయ్యి వన్డే పరుగుల్ని నమోదు చేశాడు. తాజా మ్యాచ్‌లో పాకిస్తాన్ 67 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ ఏడు వికెట్ల నష్టానికి 305 పరుగులు చేయగా, శ్రీలంక 46.5 ఓవర్లలో 238 పరుగులకు ఆలౌటైంది.