4 బంతుల్లో 92 పరుగుల బౌలర్ పై..
ఢాకా:ఇటీవల బంగ్లాదేశ్ డివిజన్ లీగ్ క్రికెట్ మ్యాచ్ లో అంపైర్ నిర్ణయంపై అసహనం వ్యక్తం చేసి నాలుగు బంతుల్లో 92 పరుగులిచ్చి ప్రత్యర్ధి జట్టు విజయానికి కారణమైన లాల్ మతియా జట్టు బౌలర్ సుజోన్ మహ్మద్ పై 10 ఏళ్ల నిషేధం పడింది. ఆ మ్యాచ్ లో అతను వ్యవహరించిన తీరుపై పూర్తిస్థాయి విచారణ చేపట్టిన బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు పదేళ్ల పాటు నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది. దాంతో అతను సుదీర్ఘ కాలం పాటు ఏ క్రికెట్ మ్యాచ్ ల్లో పాల్గొనే అవకాశమే లేకుండా పోయింది.
'మా విచారణలో అతను తప్పు చేసినట్లు తేలింది. కావాలనే వైడ్లు, నోబాల్స్ వేసి ప్రత్యర్థి విజయానికి కారణమయ్యాడు. ఇది క్రీడా స్ఫూర్తికి పూర్తిగా విరుద్ధం. మా దేశ క్రికెట్ కు భంగం కల్గించే ఏ చర్యను ఉపేక్షించం. అందుచేతం అతనిపై 10 ఏళ్ల పాటు నిషేధం విధిస్తున్నాం'అని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు క్రమశిక్షణా కమిటి చీఫ్ షేక్ సోహెల్ తెలిపారు.
గత కొన్ని రోజుల క్రితం ఢాకా సెకండ్ డివిజన్ లీగ్ 50 ఓవర్ల మ్యాచ్‌లో లాల్‌మతియా క్లబ్, ఆక్సియామ్ గ్రూప్‌లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన లాల్‌మతియా 14 ఓవర్లలో 88 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం లాల్‌మతియా బౌలర్ సుజోన్ మహ్ముద్ తొలి ఓవర్లోనే వరుసగా 13 వైడ్‌లు, 3 నోబాల్స్ వేయగా ఇవన్నీ బౌండరీ దాటాయి. దీంతో జట్టు ఒక్క బంతి కూడా ఎదుర్కోకుండానే 80 పరుగులు చేసింది. ఆక్సియామ్ ఓపెనర్ ముస్తాఫిజుర్ రెహమన్ ఆ తర్వాతి మూడు బంతులను కూడా బౌండరీకి తరలించాడు. దీంతో జట్టు కేవలం 4 బంతులు ఎదుర్కొని 92 పరుగులు చేసింది.