
బ్యాట్ ఇప్పుడు స్మార్ట్!
చాంపియన్స్ ట్రోఫీలో సరికొత్త టెక్నాలజీ
లండన్: బ్యాట్లు కేవలం షాట్‌లు ఆడేందుకే పనికొస్తాయంటే తప్పులో కాలేసినట్లే! ఇప్పుడు స్మార్ట్‌గానూ అక్కరకొస్తాయి. ఇందుకోసం కొత్తగా చిప్‌లను బ్యాట్ హ్యాండిల్‌కు అమరుస్తున్నారు. దీంతో బ్యాట్ కదలికలు, షాట్ల లోతైన విశ్లేషణకు ఈ చిప్ సెట్లు దారి చూపించనున్నాయి. ఐసీసీతో జతకట్టిన ఇంటెల్ సంస్థ కొత్త టెక్నాలజీని ప్రవేశ పెట్టేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో బరిలోకి దిగే బ్యాట్స్‌మెన్ బ్యాట్‌కు చిప్‌ను అమరుస్తారు. ప్రతి జట్టులో ప్రయోగాత్మకంగా ముగ్గురు బ్యాట్స్‌మెన్ ‘చిప్’బ్యాట్లతో ఆడతారు. దీనివల్ల బ్యాట్ కదలికలన్నీ సునిశితంగా పసిగట్టవచ్చు.
అంతేకాదు... బ్యాట్స్‌మెన్ శైలిని అభిమానులకు మరింత చేరువ చేయడం ద్వారా సరికొత్త అనుభూతిని పొందవచ్చు. అంటే ఇప్పటిదాకా కేవలం రిప్లేలే చూసిన ప్రేక్షకులు లోతైన విశ్లేషణలు చూడొచ్చన్నమాట. కోచ్‌ల పని సులువవుతుంది. షాట్ సెలక్షన్‌లో స్పష్టంగా ఎక్కడ తప్పుజరిగిందో తెలుసుకోవచ్చు తద్వారా బ్యాట్స్‌మెన్ ప్రదర్శనను మెరుగుపర్చుకోవచ్చు. ఇందుకోసం మ్యాచ్ వేదికల్లో టెక్నాలజీ వినియోగాన్ని పెంచారు. స్పైడర్‌క్యామ్‌తో పాటు హాక్ ఐ కెమెరా, డ్రోన్ కెమెరాలతో ఈ చిప్ పనితీరు అనుసంధానించిన నెట్‌వర్క్‌కు చేరుతుంది. ఈ చిప్‌లతో బ్యాట్ స్పీడ్, బ్యాక్‌లిఫ్ట్ యాంగిల్, టైమ్ టు ఇంపాక్ట్‌లను తెలుసుకోవచ్చు. భారత్ తరఫున రోహిత్ శర్మ, రహానే, అశ్విన్‌ల బ్యాట్లకు ఈ చిప్‌లను అమరుస్తారు.