లండన్ : ఇంగ్లండ్ లోకల్ క్రికెట్ లీగ్‌లో ఓ బౌలర్ క్రీడా స్పూర్తి మరిచి క్రికెట్ అభిమానుల ఆగ్రహానికి గురయ్యాడు. ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా సదరు బౌలర్, లీగ్ నిర్వాహకులపై అభిమానులు దుమ్మెత్తిపోస్తున్నారు. విజయానికి రెండు పరుగులు .. 98 పరుగులతో బ్యాట్స్‌మన్ కెరీర్‌లో తొలి సెంచరీకి చేరువగా ఉన్నాడు.. కానీ బౌలర్ మాత్రం క్రీడాస్పూర్తిని మరిచి, కావాలనే నోబాల్ వేసి బంతి బౌండరీకి వెళ్లేలా చేశాడు. దీంతో తొలి సెంచరీ చేయాలనుకున్న బ్యాట్స్‌మన్ నిరాశగా వెనుదిరిగాడు.
సొమరెస్ట్ క్రికెట్ లీగ్‌లో భాగంగా మైన్‌హెడ్ క్రికెట్ క్లబ్, పర్నెల్ క్రికెట్ క్లబ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. మైన్‌హెడ్ బ్యాట్స్‌మన్ జాయ్ డారెల్ సెంచరీకి దగ్గరగా ఉండగా.. పర్నెల్ జట్టు బౌలర్ అమానుషంగా ప్రవర్తించి నోబాల్‌తో సెంచరీ అడ్డుకున్నాడు. ఈ ఘటనపై మైన్‌హెడ్ ఆటగాళ్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ జీవితంలో క్రికెట్‌లోనే ఇదో అత్యంత చెత్త ఘటనగా అభివర్ణిస్తూ సోషల్ మీడియా వేదికగా మండిపడ్డారు. ఇక పర్నెల్ జట్టు కెప్టెన్ మాత్రం బ్యాట్స్‌మన్‌కు క్షమాపణలు తెలిపినట్లు మైన్‌హెడ్ క్రికెట్ క్లబ్ పేర్కొంది. క్రికెట్ జెంటిల్ మెన్ గేమ్ అని ఆటగాళ్లు క్రీడాస్పూర్తిని మరచి ప్రవర్తించకూడదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
ఇక ఇలాంటి ఘటనలు అంతర్జాతీయ క్రికెట్‌లోను చోటుచేసుకున్నాయి. 2010లో వీరేంద్ర సెహ్వాగ్ సెంచరీని అడ్డుకోని శ్రీలంక బౌలర్ సురజ్ రన్‌దీవ్ క్రీడాస్పూర్తిని మరిచి విమర్శల పాలయ్యాడు. 99 పరుగుల వద్ద ఉన్న సెహ్వాగ్‌ను పరుగుతీయనివ్వకుండా నోబాల్ వేసి అడ్డుకున్నాడు. దీంతో ఓ మ్యాచ్ నిషేదం కూడా ఎదుర్కొన్నాడు. కరేబియన్ ప్రిమీయర్ లీగ్‌లో కీరన్ పోలార్డ్, ఎవిన్ లూయిస్ శతకాన్ని అడ్డుకోని ఇలానే విమర్శల పాలయ్యాడు.
Comments
Please login to add a commentAdd a comment