
విచారణకు హాజరైన షమీ భార్య హసిన్
సాక్షి, స్పోర్ట్స్ : టీమిండియా పేసర్ షమీపై మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు చేసి పెను కలకలమే రేపింది అతని భార్య హసిన్ జహాన్. ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టు నియమించిన సీవోఏ కమిటీ ఆదేశాలానుసారం రంగంలోకి దిగిన బీసీసీఐ అవినీతి నిరోధక విభాగ అధికారులు.. హసిన్‌ను ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసేశారు.
శనివారం సాయంత్రం కోల్‌కతా లాల్‌బజార్‌లోని పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌కు చేరుకున్న నలుగురు అధికారులు సుదీర్ఘంగా ఆమెను ప్రశ్నించారు. అంతకు ముందు ఆమె చేసిన ఆరోపణలపై ఆమెకు విచారణకు హాజరుకావాలని సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇక విచారణలో ఆమె చేసిన ప్రధాన ఆరోపణలు.. ఆమె ఆ విషయాలు ఎలా తెలుసన్న కోణంలోనే మూడు గంటలపాటు ప్రశ్నలు గుప్పించినట్లు సమాచారం. వాటిలో చాలా వరకు ఆమె తడబడటం, మౌనంగా ఉండటంతో మరోసారి ఆమెను ప్రశ్నించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
పాకిస్థాన్‌కు చెందిన అలిషబా అనే యువతి నుంచి డబ్బులు తీసుకుని షమీ మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడని. దీని వెనుక ఇంగ్లాండ్‌కు చెందిన వ్యాపారవేత్త మహమ్మద్ భాయ్ ఉన్నాడంటూ జహాన్ ఆరోపించారు. ఇక ప్రస్తుత దర్యాప్తు అనంతరం అధికారులు ఇచ్చే రిపోర్ట్‌పైనే షమీ క్రికెట్ భవిష్యత్తు ఆధారపడి ఉంది. అయితే హసీన్ తనపై చేసిన ఆరోపణలు నిజమని తేలితే తనను ఉరి తీయాలంటూ షమీ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తనకేం పాపం తెలీదని.. ఈ వ్యవహారంలో తనకు సాయం చేయాలని బీసీసీఐని షమీ వేడుకున్నాడు.