రవిశాస్త్రి వైఖరిపై బీసీసీఐ అసంతృప్తి
న్యూఢిల్లీ:భారత క్రికెటర్ల జీత భత్యాల విషయంలో తమకు ఎవరి మధ్యవర్తిత్వమూ అవసరం లేదని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ)తాజాగా స్పష్టం చేసింది. ఈ మేరకు ఆటగాళ్ల తాజా కాంట్రాక్ట్ వేతనాలు ఎంతమాత్రం ఆమోద యోగ్యం లేవంటూ ధ్వజమెత్తిన భారత క్రికెట్ జట్టు మాజీ డైరక్టర్ రవిశాస్త్రిపై బీసీసీఐ అసంతృప్తి వ్యక్తం చేసింది. తమకు ఎవరి సలహాలు అవసరం లేదని రవిశాస్త్రి జోక్యాన్ని తప్పబట్టారు బీసీసీఐ పరిపాలన కమిటీ సీఈవో వినోద్ రాయ్.
'ఆటగాళ్ల వార్షిక వేతనాల విషయంలో మేము చాలా క్లియర్ గా ఉన్నాం. దీనిపై ఏ ఒక్కరి సలహా మాకు అక్కర్లేదు. ఆటగాళ్లకు బీసీసీఐకి మధ్యవర్తిత్వం అసలు అవసరమే లేదు. శాలరీల పెంపుపై భారత ప్రధాన కోచ్ అనిల్ కుంబ్లే ఒక నివేదిక అందజేశాడు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లితో ఇప్పటికే సమావేశమయ్యాం. ఆటగాళ్ల వేతనాల పెంపుకు సంబంధించి ఏమైనా ఇబ్బందులు తలెత్తితే త్వరలోనే పరిష్కరిస్తాం. మాకు ఎవరి సలహాలు అక్కర్లేదనే విషయంలో మాత్రం చాలా క్లియర్ గా ఉన్నాం'అని వినోద్ రాయ్ అన్నారు.
ఇటీవల ఆటగాళ్లకు బీసీసీఐ చెల్లిస్తున్న వార్షిక వేతనంపై రవిశాస్త్రి మండిపడ్డాడు. ఇతర దేశ క్రికెటర్లతో పోలిస్తే వారికి లభిస్తున్నది ఏ మూలకు సరిపోతుందని ప్రశ్నించారు.‘ఏ’ గ్రేడ్ ఆటగాళ్లకు రూ.2 కోట్లు కాకుండా మరింత ఎక్కువగా ఇవ్వాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. 'ఏ' గ్రేడ్ ఆటగాళ్ల వార్షిక వేతనం రూ. కోటిని రెట్టింపు చేసిన తరువాత రవిశాస్త్రి పెదవి విప్పాడు.