కోహ్లి, శాస్త్రిలను సేవ్ చేసిన బీసీసీఐ!
ముంబై: శ్రీలంక పర్యటనకు భారత క్రికెట్ జట్టు బుధవారం పయనమైన సంగతి తెలిసిందే. ఈ మేరకు భారత జట్టు లంక పర్యటనకు బయల్దేరి ముందు ముంబైలో 15 నిమిషాల పాటు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. అయితే ఆ సమావేశంలో పదే పదే కుంబ్లే గురించి మీడియా తనదైన శైలిలో 'బౌన్సర్లు' సంధించింది. ప్రధానంగా కోహ్లి మైక్ తీసుకున్న సమయంలో మీడియా నుంచి ఊహించని ప్రశ్నలు ఎదురయ్యాయి. దాంతో 15 నిమిషాల సమావేశాన్ని 10 నిమిషాల్లో ముగించేసింది భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ).
భారత క్రికెట్ జట్టు తమ విదేశీ పర్యటనలకు వెళ్లే ముందుగా మీడియా సమావేశంలో పాల్గొనడం సర్వసాధారణంగా జరుగుతుంది. ఆ క్రమంలోనే లంక పర్యటనకు ముందు భారత క్రికెట్ జట్టు మీడియా సమావేశంలో పాల్గొంది. దీనిలో భాగంగా రవిశాస్త్రి, కోహ్లిలు తమ అభిప్రాయాలను మీడియాతో పంచుకుంటూ వస్తున్నారు. అయితే కోహ్లి మైక్ అందుకున్న తరువాత మీడియా వేగం పెంచింది. ప్రధానంగా ఇటీవల కాలంలో భారత జట్టులో చోటు చేసుకున్న పరిణామాలపై ప్రశ్నల వర్షం కురిపించింది. కోచ్ గా కుంబ్లే ఆకస్మికంగా వైదొలగడంతో పాటు అతనితో నెలకొన్న విబేధాలు గురించి కోహ్లిని మీడియా గుచ్చిగుచ్చి ప్రశ్నించింది. దీన్ని గమనించిన బీసీసీఐ 10 నిమిషాల్లోనే సమావేశం ముగిసినట్లు ప్రకటించింది. ఇలా 10 నిమిషాల్లో ప్రెస్ మీట్ ముగియడంతో కోహ్లి, రవిశాస్త్రికి పెద్ద తలనొప్పి తప్పినట్లయ్యింది.