జడేజాపై జరిమానా
బీసీసీఐ ఆగ్రహం
సౌతాంప్టన్: ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్టులో పేసర్ జేమ్స్ అండర్సన్‌తో జరిగిన గొడవ వివాదంలో భారత్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాపై జరిమానా పడింది. ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ లెవల్-1 కింద దోషిగా తేలడంతో అతడి మ్యాచ్ ఫీజులో 50 శాతం జరిమానా విధిస్తున్నట్టు మ్యాచ్ రిఫరీ డేవిడ్ బూన్ ప్రకటించారు. ఇంగ్లండ్ టీమ్ మేనేజిమెంట్ ఆరోపించినట్టుగా లెవల్-2 నిబంధనను జడేజా అతిక్రమించలేదని స్పష్టం చేశారు. గురువారం జరిగిన ఈ విచారణకు ఈ ఇద్దరు ఆటగాళ్లతో పాటు వారి లీగల్ కౌన్సిల్స్, సాక్షులు, బీసీసీఐ నుంచి ఎంవీ శ్రీధర్ హాజరయ్యారు.
నాటింగ్‌హామ్ మ్యాచ్ రెండో రోజు లంచ్ విరామ సమయంలో జడేజా, అండర్సన్ మధ్య గొడవ జరిగిన విషయం తెలిసిందే. మరోవైపు ఈ జరిమానాపై బీసీసీఐ ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ ఆటగాడికి అండగా నిలుస్తూ ఈ నిర్ణయాన్ని అప్పీల్ చేస్తామని తెలిపింది. ‘ఐసీసీ నిర్ణయం మాకు సంతృప్తిని కలిగించలేదు. దీనికి వ్యతిరేకంగా మేం అప్పీల్ చేసుకుంటాం. రవీంద్ర జడేజా ఎలాంటి తప్పు చేయలేదని బీసీసీఐ నమ్ముతోంది. అతడికి మేం పూర్తిగా మద్దతిస్తున్నాం’ అని బోర్డు తెలిపింది.