
'టాప్ క్లాస్ క్రికెటర్లు ఎందుకు రావడం లేదు'
కోల్ కతా:క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్(క్యాబ్) నుంచి ఎక్కువ మంది టాప్ క్లాస్ క్రికెటర్లు రాకపోవడం పట్ల టీమిండియా మాజీ డైరెక్టర్ రవిశాస్త్రి ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. పశ్చిమ బెంగాల్ లో క్రికెట్ పై ఆసక్తి ఎక్కువగానే ఉన్నా అత్యున్నత స్థాయి క్రికెటర్లు రాకపోవడం నిజంగా అర్ధం కావడం లేదన్నాడు. కోల్ కతా లో జరిగిన ఓ ప్రమోషనల్ ఈవెంట్ లో భాగంగా హాజరైన రవిశాస్త్రి వార్తా సమావేశంలో మాట్లాడాడు. అంతర్జాతీయ స్థాయిలో సౌరవ్ గంగూలీ శకం ముగిసిన తరువాత ఆ స్థాయి క్రికెటర్లు బెంగాల్ క్రికెట్ నుంచి రాకపోవడం తనను ఆశ్చర్యానికి గురి చేస్తుందన్నాడు. ఈ విషయంలో బెంగాల్ క్రికెట్ సంఘం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నాడు.
'నా బాల్యంలో ఎక్కువగా కోల్ కతా కు వచ్చేవాడ్ని. ఈ క్రమంలోనే పచ్చదనంతో నిండిన ఈడెన్ గార్డెన్ స్టేడియం చూసి ఆశ్చర్యపోయేవాన్ని. అత్యుత్తమ స్టేడియాల్లో ఈడెన్ కూడా ఒకటి. క్రికెట్ ఆడటానికి ఇక్కడ తగినంత స్థలం ఉంది. దీంతో పాటు బెంగాల్ లో క్రికెట్ పై మక్కువ అత్యధికం. అటువంటప్పుడు అంతర్జాతీయ స్థాయి క్రికెటర్లు ఎందుకు రావడం లేదు. టాప్ క్లాస్ క్రికెటర్ల అన్వేషణపై బెంగాల్ క్రికెట్ సంఘం దృష్టి పెట్టాల్సిన అవసరముంది ' అని రవిశాస్త్రి పేర్కొన్నాడు.