
బెంగళూరు: తన విజయ పరంపర కొనసాగిస్తూ ఆంధ్రప్రదేశ్ టెన్నిస్ ప్లేయర్ సాకేత్ మైనేని బెంగళూరు ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టోర్నమెంట్‌లో సెమీఫైనల్లోకి అడుగు పెట్టాడు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో సాకేత్ 6–4, 6–4తో డిఫెండింగ్ చాంపియన్ సుమీత్ నాగల్ (భారత్)పై సంచలన విజయం సాధించాడు. 56 నిమిషాల్లోనే ముగిసిన ఈ మ్యాచ్‌లో సాకేత్ నాలుగు ఏస్‌లు సంధించాడు.
తన సర్వీస్‌ను రెండుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేశాడు. భారత్‌కే చెందిన ప్రజ్నేశ్ గుణేశ్వరన్ కూడా సెమీస్‌కు చేరాడు. క్వార్టర్ ఫైనల్లో శశికుమార్ ముకుంద్ (భారత్) నుంచి ప్రజ్నేశ్‌కు ‘వాకోవర్’ లభించింది. పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో సాకేత్ మైనేని–అర్జున్ ఖడే (భారత్) ద్వయం 6–3, 2–6, 8–10తో పురవ్ రాజా (భారత్)–సాన్సిచ్ (క్రొయేషియా) జోడీ చేతిలో ఓడింది.