
ప్రపంచ క్రికెట్‌లో అతడొక రారాజు. తన ముందు ఉన్న ఎంతటి లక్ష్యమున్న వెనకడుగేయని ధీరుడు. కొండంత లక్ష్యాన్ని అలోవకగా కరిగించే ఛేజ్ మాస్టర్. ఐసీసీ టోర్నమెంట్‌లు అంటే పరుగులు వరద పారించే రన్ మిషన్ అతడు. అతడే టీమిండియా లెజెండ్ విరాట్ కోహ్లి. ఐసీసీ ఈవెంట్లలో తనకు ఎవరూ సాటి రారాని కోహ్లి మరోసారి నిరూపించుకున్నాడు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో దుబాయ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి సెమీఫైనల్లో కోహ్లి అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు.

264 పరుగుల లక్ష్యచేధనలో పవర్ ప్లేలోనే ఓపెనర్లు వికెట్లు కోల్పోయి భారత్ కష్టాల్లో పడింది. ఈ దశలో కింగ్ కోహ్లి బాధ్యతాయుత ఇన్నింగ్స్‌తో ఆదుకున్నాడు. శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్‌తో కలిసి కీలక భాగస్వామ్యాలు నెలకొల్పి భారత్‌ను విజయం దిశగా నడ్పించాడు.
అయితే భారత్ విజయానికి మరో 39 పరుగులు కావాల్సిన దశలో ఓ భారీ షాట్‌కు ప్రయత్నించి కోహ్లి ఔటయ్యాడు. 98 బంతులు ఎదుర్కొన్న కోహ్లి 5 ఫోర్ల సాయంతో 84 పరుగులు చేశాడు. అతడి అద్బుత ఇన్నింగ్స్ ఫలితంగా ఆసీస్‌ను 4 వికెట్ల తేడాతో భారత్ ఓడించి ఫైనల్లో అడుగుపెట్టింది.

జస్ట్ సెంచరీ మిస్..
కాగా కేవలం 16 పరుగుల దూరంలో తన 52వ వన్డే సెంచరీ చేసే అవకాశాన్ని కింగ్ కోహ్లి కోల్పోయాడు. అయితే కోహ్లి సెంచరీ చేసే అవకాశాన్ని తృటిలో కోల్పోవడంతో తన సహచర ఆటగాళ్లతో పాటు అభిమానులు నిరాశచెందారు.
ఈ క్రమంలో మ్యాచ్ అనంతరం మాట్లాడిన కోహ్లి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
వ్యక్తిగత రికార్డుల కంటే జట్టు విజయమే తనకు ముఖ్యమని కోహ్లి చెప్పుకొచ్చాడు. "పాకిస్తాన్‌పై ఎలా లక్ష్యాన్ని ఛేదించామో ఇది కూడా దాదాపు అదే తరహాలో సాగింది. అప్పుడు సెంచరీ చేసినా ఏడు ఫోర్లే కొట్టాను. పరిస్థితులను అర్థం చేసుకోవడమే అన్నింటికంటే ముఖ్యం. దాని ప్రకారమే నా వ్యూహం సాగుతుంది. స్ట్రయిక్ రొటేట్ చేయడం కూడా అలాంటిదే.
ఇలాంటి పిచ్‌పై భాగస్వామ్యాలు నెలకొల్పడం కీలకం. బౌండరీలతో వేగంగా ఆటను ముగించే ప్రయత్నంలో నేను వెనుదిరిగా. కొన్నిసార్లు అనుకున్న ప్రణాళికలు పని చేయవు. క్రీజులో పరుగుల కోసం నేను తొందరపడలేదు. అదే నా ఇన్నింగ్స్‌లో నాకు నచ్చిన విషయం. సింగిల్స్ తీయడాన్ని కూడా ప్రాధాన్యతగా భావిస్తేనే మంచి క్రికెట్ ఆడుతున్నట్లు లెక్క. ఇక ఎలాంటి ఒత్తిడి లేదు. లక్ష్యం దిశగా వెళుతున్నామని అప్పుడే అర్థమవుతుంది.

ఇలాంటి నాకౌట్ మ్యాచ్‌లలో చేతిలో వికెట్లు ఉంటే ప్రత్యర్థి కూడా ఒత్తిడిలో సునాయాసంగా పరుగులు ఇచ్చేస్తుంది. అప్పుడు మన పరిస్థితి మరింత సులువవుతుంది. ఓవర్లు, చేయాల్సిన పరుగుల గురించి స్పష్టత ఉంటే చాలు. రన్‌రేట్ ఆరు పరుగులకు వచ్చినా సమస్య ఉండదు. ఎందుకంటే ఈ సమయంలో వికెట్లు తీస్తేనే ప్రత్యర్ధులకు అవకాశం దక్కుతుంది తప్ప నిలదొక్కుకున్న బ్యాటర్లను వారు అడ్డుకోలేరు.
ఈ దశలో మైలురాళ్లు నాకు ఏమాత్రం ముఖ్యం కాదు. సెంచరీ సాధిస్తే మంచిదే. లేకపోతే విజయం దక్కిన ఆనందం ఎలాగూ ఉంటుంది. డ్రెస్సింగ్ రూమ్‌లో సంబరాలు ఉంటాయి. ఏం చేసినా ఒదిగి ఉండి మళ్లీ సాధన చేయడం, జట్టును గెలిపించేందుకు మళ్లీ కొత్తగా బరిలోకి దిగడమే నాకు తెలిసింది. ఇప్పటికీ అదే చేస్తున్నాను" అని ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్ విరాట్ కోహ్లి పేర్కొన్నాడు.
చదవండి: ఆఖరి వరకు ఏమీ చెప్పలేం.. వారిద్దరి వల్లే ఈ విజయం: రోహిత్ శర్మ