
మాంచెస్టర్: కండరాల నొప్పితో బాధపడుతున్న టీమిండియా పేసర్ భువనేశ్వర్‌కు స్టాండ్ బై ప్లేయర్‌గా నవ్‌దీప్ షైనీకి భారత క్రికెట్ జట్టు మేనేజ్‌మెంట్ నుంచి పిలుపు అందింది. భారత జట్టు నుంచి పిలుపు అందిన మరుక్షణమే అతను ఇంగ్లండ్ విమానం ఎక్కేశాడు. సోమవారం జట్టుతో కలిసిన షైనీ ప్రాక్టీస్‌లో నిమగ్నమయ్యాడు. ఈ నెల 16వ తేదీన పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్ సందర్భంగా భువనేశ్వర్ కుమార్ గాయపడ్డ విషయం తెలిసిందే. బౌలింగ్ చేస్తున్న సమయంలో అతని కాలి కండరాలు పట్టేశాయి. దీనితో ఓవర్ మధ్య నుంచే భువనేశ్వర్ కుమార్ అర్ధాంతరంగా తప్పుకొన్నాడు. అఫ్గానిస్తాన్‌తో మ్యాచ్‌కు కూడా దూరం అయ్యాడు. భువనేశ్వర్ కుమార్ గాయం పరిస్థితిపై భారత క్రికెట్ జట్టు మేనేజ్‌మెంట్ నుంచి ఎలాంటి అప్‌డేట్స్ కూడా లేవు. అయినప్పటికీ అతను కోలుకుంటాడని, ఈ నెల 30వ తేదీన ఇంగ్లండ్‌తో జరిగే మ్యాచ్ నాటికి అందుబాటులోకి వస్తాడని ఆశిస్తున్నారు అభిమానులు.
ఈలోగా స్టాండ్ బై ఫాస్ట్ బౌలర్‌గా ఉన్న నవ్‌దీప్ షైనీకి టీమిండియా మేనేజ్‌మెంట్ నుంచి పిలుపు అందింది. దీనితో అతను హుటాహుటీన ఇంగ్లండ్‌కు బయలుదేరి వెళ్లాడు. కాగా, నవ్‌దీప్ షైనీని కేవలం నెట్ బౌటర్‌గా సేవలను అందించడానికి మాత్రమే పిలిపించుకున్నట్లు టీమ్ మేనేజ్‌మెంట్ చెబుతోంది. భువనేశ్వర్ కుమార్ అందుబాటులో లేకపోవడం వల్ల నెట్ ప్రాక్టీస్ సమయంలో టీమిండియా బ్యాట్స్‌మెన్లు కాస్త ఇబ్బందులకు గురి అవుతున్నారు. సరైన ఫాస్ట్ బౌలర్ లేకపోవడం వల్ల ఆ విభాగం బలహీన పడినట్లు భావిస్తున్నారు. సరైన టెక్నిక్‌తో బంతులను సంధించే ఫాస్ట్ బౌలర్ అందుబాటులో ఉంటే నెట్ ప్రాక్టీస్ సులువుగా ఉంటుందని నిర్ణయానికి వచ్చారు.
ఒకవేళ భువనేశ్వర్ కుమార్ మిగిలిన మ్యాచ్‌లకు కూడా దూరంగా ఉండాల్సి వస్తే.. నవ్‌దీప్ షైనీని ఆడించే అవకాశాలను మాత్రం కొట్టి పారేయట్లేదు. స్పెషలిస్ట్ పేస్ బౌలర్‌గా షైనీని ప్రపంచకప్ మ్యాచుల్లో ఆడించే అవకాశాలు ఉన్నాయని టీమ్ మేనేజ్‌మెంట్ సూచనప్రాయంగా చెబుతోంది. భువనేశ్వర్ కుమార్ స్థానాన్ని ఇంకా ఏ ఆటగాడితోనూ భర్తీ చేయలేదు. అతని స్థానంలో ఆల్‌రౌండర్ విజయ్ శంకర్‌ను తుది జట్టులోకి తీసుకున్నారు. కొన్ని రోజుల క్రితం శిఖర్ ధావన్ గాయపడటంతో రిషభ్ పంత్‌ను స్టాండ్ బైగా ఎంపిక చేశారు. ఆ తర్వాత ధావన్ పూర్తిగా టోర్నీ నుంచి వైదొలిగినా, పంత్‌కు ఆడే అవకాశం ఇంకా రాలేదు.
Comments
Please login to add a commentAdd a comment