లండన్: యాషెస్ సిరీస్‌లో ఆసీస్ ఆటగాడు స్టీవ్ స్మిత్ తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. జోఫ్రా ఆర్చర్ 149 కి.మీ వేగంతో షార్ట్ లెగ్‌లో వేసిన బంతి స్మిత్ మెడకు బలంగా తాకడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు స్మిత్. దాంతో ఒక్కసారిగా ఆస్ట్రేలియా శిబిరంలో ఆందోళన మొదలైంది. జట్టు ఫిజియో ప్రాథమిక చికిత్స తర్వాత స్మిత్ మెల్లగా పైకి లేచి మైదానాన్ని వీడాడు. అయితే స్మిత్‌కు ఇలా జరగడంపై ఇంగ్లండ్ కెప్టెన్ జోరూట్ ఆవేదన వ్యక్తం చేశాడు. అదొక భయంకరమైన క్షణమని పేర్కొన్న రూట్.. స్మిత్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించాడు. స్మిత్ మెడకు బంతి తగిలిన వెంటనే తమ ఆటగాళ్లలో ఆందోళన మొదలైందని, అయితే కాసేపటికి అతను తేరుకోవడంతో ఊపిరి పీల్చుకున్నామన్నాడు.
తమ డ్రెస్సింగ్ రూమ్‌లో సభ్యులంతా దీనిపై కలవరపాటుకు గురయ్యారని, స్మిత్ తొందరగా తేరుకోవాలని ఆకాంక్షిస్తున్నామన్నాడు. ఇక గెలుస్తామనుకున్న టెస్టు మ్యాచ్ డ్రాగా ముగియడం నిరాశ కల్గించిందన్నాడు. రెండో ఇన్నింగ్స్‌లో స్మిత్ స్థానంలో కాంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన లబషేన్ తమ గెలుపును అడ్డుకున్నాడన్నాడు. అతను ఆద్యంతం ఆకట్టుకుని హాఫ్ సెంచరీ సాధించడంతో పర్యాటక ఆసీస్ జట్టు మ్యాచ్‌ను డ్రా చేసుకుందన్నాడు. ఇక తమ పేసర్ జోఫ్రా ఆర్చర్‌పై రూట్ ప్రశంసలు కురిపించాడు. తమ పేస్ విభాగం యూనిట్‌లో అత్యంత ప్రభావం చూపే బౌలర్ ఆర్చర్ అని కొనియాడాడు.
Comments
Please login to add a commentAdd a comment