గీలాంగ్: మహిళల బిగ్‌బాష్‌లో భాగంగా బుధవారం మెల్‌బోర్న్ రెనిగేడ్స్-సిడ్నీ సిక్సర్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. చివరి బంతికి రెనిగేడ్స్ వికెట్ కీపర్ ఎమ్మా ఇంగ్లిస్ బెయిల్స్ పడగొట్టడం మరచిపోయి గెలిచామన్న సంబరాల్లో మునిగిపోవడంతో హైడ్రామా నెలకొంది.
వివరాల్లోకి వెళితే.. తొలుత బ్యాటింగ్ చేసిన రెనిగేడ్స్ నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 120 పరుగులు చేసింది. ఆపై 121 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన సిడ్నీ సిక్సర్స్ కడవరకూ పోరాడుతూ విజయం దిశగా దూసుకొచ్చింది. ఈ క్రమంలోనే చివరి బంతికి సిడ్నీ సిక్సర్ విజయానికి మూడు పరుగులు అవసరమయ్యాయి. ఆ సమయంలో క్రీజ్‌లో ఉన్న సిక్సర్స్ క్రీడాకారిణి షారా అలే ఫైన్ లెగ్ మీదుగా షాట్ కొట్టింది. ఆ తరుణంలోనే సిక్సర్స్ పరుగును పూర్తి చేసుకుని రెండో పరుగుకు సిద్దమైంది. కాగా, ఫైన్ లెగ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న క్రిస్ బ్రిట్ అందుకుని తమ కీపర్ ఎమ్మాకు వేగంగా విసిరడంతో రెనిగెడ్స్ విజయం దాదాపు ఖాయమైంది.
అక్కడ వికెట్లను పడగొట్టడం మరిచిపోయిన ఎమ్మా .. గెలిచామన్న సంబరాల్లో మునిగిపోయింది. అయితే రెండో పరుగు కోసం అప్పటికే కాచుకుని కూచున్న సిడ్నీ సిక్సర్స్ క్రీడాకారిణులు దాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. దాంతో నివ్వెరపోవడం రెనిగెడ్స్ వంతైంది. ఆ బంతి డెడ్ అయ్యిందనే రెనిగెడ్స్ వాదనను అంపైర్ తిరస్కరించడంతో మ్యాచ్ టై అయ్యింది. అలా ఆ మ్యాచ్ 'సూపర్ ఓవర్'కు దారి తీసింది. దానిలో భాగంగా ఇరు జట్లు ఆడిన ఎలిమినేటర్ ఓవర్‌లో రెనిగెడ్స్ విజయం సాధించి ఊపిరిపీల్చుకుంది. ఒకవేళ మ్యాచ్ ఓడిపోతే మాత్రం కీపర్ చేసిన పొరపాటుకు రెనిగేడ్స్ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చేది.
Comments
Please login to add a commentAdd a comment