రికార్డుల కల్లోలం | Brendon McCullum, Watling break world record in 2nd test against India | Sakshi
Sakshi News home page

రికార్డుల కల్లోలం

Published Tue, Feb 18 2014 12:31 AM | Last Updated on Wed, Oct 17 2018 4:43 PM

రికార్డుల కల్లోలం - Sakshi

రికార్డుల కల్లోలం

 అజేయ డబుల్ సెంచరీతో చెలరేగిన బ్రెండన్ మెకల్లమ్  వాట్లింగ్ శతకం
 ఆరో వికెట్‌కు ప్రపంచ రికార్డు భాగస్వామ్యం  ఆసక్తికరంగా భారత్‌తో రెండో టెస్టు
 ప్రస్తుతం 325 పరుగుల ఆధిక్యంలో న్యూజిలాండ్

 
 పట్టిన పట్టు విడుచుటకంటే పడి చచ్చుట మేలు...న్యూజిలాండ్ బ్యాట్స్‌మన్ బ్రెండన్ మెకల్లమ్‌కు ఇది బాగా వంటబట్టినట్లుంది. అంతే మూడో రోజు ఆటతో జట్టును రక్షించిన అతను నాలుగో రోజు మరింత చెలరేగి ముందంజలో నిలిపాడు.
 
 పట్టిన పట్టు వదలటంలో భారత బౌలర్లను మించినవారెవరు...గతంలో ఎన్నో సార్లు వెంటాడిన ఈ బలహీనత వెల్లింగ్టన్‌లో మళ్లీ బయట పడింది. ఫలితంగా  రోజంతా శ్రమించినా ఒక వికెట్ మాత్రమే తీసి మ్యాచ్‌ను ప్రత్యర్థి చేతిలో పెట్టారు.
 
 తొలి ఇన్నింగ్స్‌లో అద్భుత బౌలింగ్, అంతకు మించిన బ్యాటింగ్‌తో చాన్నాళ్ల తర్వాత విదేశీ గడ్డపై చిరస్మరణీయ విజయానికి చేరువైన భారత్... అనూహ్యంగా ఇప్పుడు మ్యాచ్‌ను కోల్పోయే స్థితికి దిగజారింది. కివీస్ రికార్డుల హోరులో భారత్ ప్రదర్శన ఒక్కసారిగా పేలవంగా మారిపోయింది.
 

  •      కివీస్ తరఫున ఇది (281)  రెండో అత్యధిక స్కోరు. మార్టిన్ క్రో (299) తొలి స్థానంలో ఉన్నాడు. మరో 19 పరుగులు చేస్తే మెకల్లమ్ ఆ జట్టు తరఫున ట్రిపుల్ సెంచరీ చేసిన తొలి ఆటగాడిగా రికార్డు సృష్టిస్తాడు.
  •      రెండో ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో ఈ ఇన్నింగ్స్ నాలుగో స్థానంలో ఉంది. ఒక్క హనీఫ్ మొహమ్మద్ (337) మాత్రమే రెండో ఇన్నింగ్స్‌లో ట్రిపుల్ సెంచరీ చేశాడు.
  •      మెకల్లమ్ కెరీర్‌లో మూడో సారి 200కు పైగా స్కోరు నమోదు చేశాడు. కివీస్ తరఫున ఫ్లెమింగ్ (3)తో సమంగా నిలిచాడు. ఈ మూడు డబుల్స్ భారత్‌పైనే కావడం విశేషం.
  •      కివీస్ గడ్డపై ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక బంతులు ఎదుర్కొన్న క్రికెటర్ (525). కివీస్ తరఫున ఎక్కువ సేపు బ్యాటింగ్ చేసిన రికార్డు (దాదాపు 727 నిమిషాలు).
  •      వరుసగా రెండు టెస్టుల్లో డబుల్ సెంచరీలు చేసిన తొలి కివీస్ బ్యాట్స్‌మన్.

 
 వెల్లింగ్టన్: న్యూజిలాండ్‌తో రెండో టెస్టులో నెగ్గి సిరీస్ సమం చేయాలనుకున్న భారత జట్టు ఆశలు నెరవేరేలా కనిపించడం లేదు. కివీస్ కెప్టెన్ బ్రెండన్ మెకల్లమ్ (525 బంతుల్లో 281 బ్యాటింగ్; 28 ఫోర్లు, 4 సిక్స్‌లు) అద్భుతమైన ఆటతో డబుల్ సెంచరీ సాధించడంతో మ్యాచ్‌పై కివీస్ పట్టు బిగిసింది. మెకల్లమ్‌కు తోడు వాట్లింగ్ (367 బంతుల్లో 124; 13 ఫోర్లు) కూడా సెంచరీ సాధించడంతో కివీస్ తమ రెండో ఇన్నింగ్స్‌లో సోమవారం నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 6 వికెట్ల నష్టానికి 571 పరుగులు చేసింది. మెకల్లమ్‌తో పాటు నీషామ్ (96 బంతుల్లో 67 బ్యాటింగ్; 9 ఫోర్లు) క్రీజ్‌లో ఉన్నాడు. మెకల్లమ్, వాట్లింగ్ ఆరో వికెట్‌కు 352 పరుగుల ప్రపంచ రికార్డు భాగస్వామ్యం నెలకొల్పడం నాలుగో రోజు ఆటలో విశేషం. ప్రస్తుతం ఆ జట్టు 325 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఒక దశలో రెండో ఇన్నింగ్స్‌లో 94/5తో ఉన్న కివీస్ మరో వికెట్ మాత్రమే కోల్పోయి 477 పరుగులు జోడించింది.
 
 ఆగని జోరు...
 
 మూడో రోజు ఆటలో జట్టును కాపాడే మొదటి అంకాన్ని పూర్తి చేసిన మెకల్లమ్, సోమవారం భారీ స్కోరు అందించడంపై దృష్టి పెట్టాడు. భారత్ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని మినహాయిస్తే ఓ రకంగా 5 వికెట్లకు 6 పరుగుల స్కోరు మాత్రమే ఉన్న స్థితి!  ఈ దశలో వాట్లింగ్ అండతో మెకల్లమ్ అద్భుతమైన పోరాటపటిమను కనబర్చాడు. ఒక్క తప్పుడు షాట్ భారత్‌కు మ్యాచ్ అందించే అవకాశం ఉండటంతో చాలా జాగ్రత్తగా ఆడాడు. భారత బౌలర్లు ఎంత ప్రయత్నించినా వికెట్ పడగొట్టడంలో విఫలమయ్యారు. జహీర్, షమీ, ఇషాంత్ ఎండ్‌లు మార్చినా, రౌండ్ ద వికెట్ బౌలింగ్ చేసినా ఫలితం దక్కలేదు. జహీర్ బౌలింగ్‌లో మూడో స్లిప్‌లో బ్రెండన్ క్యాచ్‌కు ఒకే ఒక సారి అవకాశం వచ్చినా బంతి ధావన్‌నుంచి చాలా దూరంగా వెళ్లిపోయింది.
 
 మళ్లీ డబుల్...
 

 ఇదే క్రమంలో మెకల్లమ్ 150 పరుగుల మార్క్‌ను దాటగా...వాట్లింగ్ 297 బంతుల్లో కెరీర్‌లో మూడో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కొద్ది సేపటికి జహీర్ బౌలింగ్‌లో లెగ్‌సైడ్ దిశగా ఫ్లిక్ చేసి మెకల్లమ్ వరుసగా రెండో టెస్టులోనూ డబుల్ సెంచరీని అందుకున్నాడు. ఈ ఇద్దరి భాగస్వామ్యంలో అనేక పాత రికార్డులు గల్లంతయ్యాయి. ఎట్టకేలకు మూడో కొత్త బంతి తీసుకున్న తర్వాత తొలి ఓవర్లోనే షమీ ఈ మారథాన్ భాగస్వామ్యాన్ని విడదీశాడు. వాట్లింగ్ ఎల్బీగా వెనుదిరగడంతో ఏకంగా 123 ఓవర్ల తర్వాత భారత్‌కు వికెట్ దక్కింది.
 
 కథ మారలేదు...
 
 అయితే వికెట్ తీసినా భారత్ ఆనందం ఎంతో సేపు నిలవలేదు. కెరీర్‌లో తొలి టెస్టు ఆడుతున్న నీషామ్, కెప్టెన్‌కు అండగా నిలిచాడు. దాంతో మరో కీలక భాగస్వామ్యం నెలకొంది. బౌలర్లకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా దూసుకుపోయిన మెకల్లమ్ షమీ బౌలింగ్‌లో భారీ సిక్స్ కొట్టి 250 పరుగులు దాటాడు. ఏడో వికెట్‌కు ఇప్పటికే మెకల్లమ్, నీషామ్ అభేద్యంగా 125 పరుగుల జత చేయడం విశేషం.
 
 నేడు ఏం జరగవచ్చు!
 
 ‘ఓడిపోయే దశనుంచి శాసించే స్థితికి చేరుకోవడం సాధారణ విషయం కాదు. దీనిని వృథా చేయదల్చుకోలేదు. కాబట్టి చివరి రోజు బ్యాటింగ్ కొనసాగించడంపై ఆలోచించి నిర్ణయం తీసుకుంటా’ అని మెకల్లమ్ ఆట అనంతరం వ్యాఖ్యానించాడు. కివీస్ తరఫున తొలి ట్రిపుల్ సెంచరీ సాధించే అవకాశం ఇప్పుడు అతని ముంగిట ఉంది. 19 పరుగులే కాబట్టి వేగంగా సాధించి ఆ వెంటనే డిక్లేర్ చేయవచ్చు. ఇప్పటికే 325 పరుగుల ఆధిక్యంలో ఉన్న కివీస్ కనీసం 80 ఓవర్లలో దాదాపు 350 పరుగుల లక్ష్యం భారత్ ముందు ఉంచవచ్చు. గత రికార్డులు, చివరి రోజు పిచ్‌ను దృష్టిలో ఉంచుకుంటే ఛేదించడం అంత సులువు కాదు కాబట్టి భారత్ గెలిచే అవకాశాలు తక్కువే! అయితే ఎలాగూ తొలి టెస్టు నెగ్గారు కాబట్టి డ్రా అయినా చాలనుకుంటే ఆలౌట్ అయ్యే వరకు కివీస్ ఆడుతుంది. పైగా తొలి టెస్టులో లక్ష్యాన్ని ఛేదిస్తూ భారత్ చాలా దూకుడుగా ఆడింది కాబట్టి మళ్లీ అలాంటి రిస్క్ కివీస్ తీసుకోకపోవచ్చు. ఒత్తిడిలో కుప్పకూలి భారత్ ఓడే ప్రమాదమూ ఉంది. కాబట్టి ప్రస్తుత పరిస్థితి ప్రకారం భారత్ గెలుపుకంటే ఓటమి లేదా డ్రాకే ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి.
 
 281 గుర్తుందా...
 
 దాదాపు 12 ఏళ్ల క్రితం కోల్‌కతాలో ఆసీస్‌పై వీవీఎస్ లక్ష్మణ్ ఆడిన ఇన్నింగ్స్ గుర్తుందా...సరిగ్గా అలాగే కాకపోయినా ఇప్పుడు మెకల్లమ్ ఇన్నింగ్స్ కూడా దాదాపు అదే తరహాలో సాగింది. ముందుగా ఆధిక్యాన్ని తొలగించి జట్టును రక్షించే ప్రయత్నం చేయడం, ఆ తర్వాత భారీ స్కోరుతో విజయానికి బాటలు వేయడం... అప్పుడు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 171 పరుగులకే ఆలౌటై 274 పరుగులు వెనుకబడింది. నాలుగో రోజు ముగిసే సరికి లక్ష్మణ్ 275 స్కోరుతో భారత్ 589/4 పరుగులు చేసింది. ఇప్పుడు కివీస్ తొలి ఇన్నింగ్స్‌లో 192 పరుగులే చేసి 246 పరుగులు వెనుకబడింది. నాలుగో రోజు ఇప్పుడు మెకల్లమ్ 281 స్కోరుతో నిలవగా, జట్టు స్కోరు 571/6. అప్పుడు చివరి రోజు ఆసీస్ 212 పరుగులకే కుప్పకూలడంతో ఆతిథ్య జట్టు మ్యాచ్ గెలుచుకుంది. మరి ఈ సారి ఆఖరి రోజు ఫలితం ఎలా ఉండబోతోందో!
 
 స్కోరు వివరాలు
 
 న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్: 192
 భారత్ తొలి ఇన్నింగ్స్: 438
 న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్: ఫుల్టన్ (ఎల్బీ) (బి) జహీర్ 1; రూథర్‌ఫోర్డ్ (సి) ధోని (బి) జహీర్ 35; విలియమ్సన్ (సి) ధోని (బి) జహీర్ 7; లాథమ్ (సి) ధోని (బి) షమీ 29; మెకల్లమ్ (బ్యాటింగ్) 281; అండర్సన్ (సి) అండ్ (బి) జడేజా 2; వాట్లింగ్ (ఎల్బీ) (బి) షమీ 124; నీషామ్ (బ్యాటింగ్) 67; ఎక్స్‌ట్రాలు 25; మొత్తం (189 ఓవర్లలో 6 వికెట్లకు) 571.
 వికెట్ల పతనం: 1-1; 2-27; 3-52; 4-87; 5-94; 6-446.
 బౌలింగ్: ఇషాంత్ 39-4-124-0; జహీర్ 43-12-129-3; షమీ 40-5-136-2; జడేజా 49-10-108-1; రోహిత్ శర్మ 11-0-40-0; కోహ్లి 6-1-13-0; ధోని 1-0-5-0.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement