
సెంచూరియన్: క్రికెట్‌లో రికార్డులను తరచూ వింటూ ఉంటాం.. చూస్తూ ఉంటాం. అయితే అరుదుగా జరిగే కొన్ని విశేషాలు మాత్రం అత్యంత ఆసక్తిని పెంచుతాయి. ఒక మ్యాచ్‌లో ఒకే తరహా గణాంకాలను నమోదు చేయడం అత్యంత అరుదుగా జరిగే విషయమే. ఒకే మ్యాచ్‌లో ఇద్దరు బ్యాట్స్‌మన్ సమానమైన పరుగులు సాధించే క్రమంలో అన్నే బంతుల్ని ఎదుర్కొంటే అది అరుదైన సందర్భంగానే నిలుస్తుంది. మరి ఒకే మ్యాచ్‌లో ఒక ఇన్నింగ్స్‌లో ఇద్దరు పేసర్లు ఒకే విధంగా పరుగులు ఇవ్వడమే కాకుండా వికెట్లను కూడా సమానంగా సాధిస్తే అది అరుదైన విషయమే. ఇలా ఇద్దరు పేసర్లు ఒకే ఇన్నింగ్స్‌లో చెరి సమంగా వికెట్లు సాధించగా పరుగులు విషయంలో కూడా అన్నే పరుగులు ఇవ్వడం తాజాగా చోటు చేసుకుంది. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టులో భాగంగా ఇంగ్లండ్ బౌలర్లు సామ్ కరాన్-స్టువర్ట్ బ్రాడ్‌లు ఈ అరుదైన జాబితాలో చేరిపోయారు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సఫారీలు 84.3 ఓవర్లలో 284 పరుగులకు ఆలౌటయ్యారు.
డీకాక్(95) రాణించడంతో దక్షిణాఫ్రికా గౌరవప్రదమైన స్కోరు చేసింది. దక్షిణాఫ్రికా జట్టును తొలి ఇన్నింగ్స్‌లో ఆలౌట్ చేసే క‍్రమంలో సామ్ కరాన్-స్టువర్ట్ బ్రాడ్‌లు పోటీ పడ్డారు. ఇద్దరూ పోటీ పడి వికెట్లు సాధించి దక్షిణాఫ్రికా నడ్డివిరిచారు. ఈ క్రమంలోనే సామ్ కరాన్ నాలుగు వికెట్లు సాధించి 58 పరుగులు ఇవ్వగా, బ్రాడ్ సైతం నాలుగు వికెట్లే సాధించి 58 పరుగులే ఇచ్చాడు. ఇలా ఒక టెస్టు మ్యాచ్‌లో ఒకే ఇన్నింగ్స్‌లో ఇద్దరూ బౌలర్లు ఒకే తరహా గణాంకాలు నమోదు చేయడం 13 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. చివరిసారి 2003లో ఇంగ్లండ్ బౌలర్లైన జేమ్స్ అండర్సన్-హర్మిసన్‌లు.. జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో తలో నాలుగు వికెట్లు సాధించి 55 పరుగుల చొప్పున ఇచ్చారు. ఆ తర్వాత ఇంతకాలానికి మళ్లీ ఇంగ్లండ్ బౌలర్లే ఆ అరుదైన మార్కును చేరుకున్నారు. ఇప్పటివరకూ టెస్టు క్రికెట్‌లో ఇలా ఒకే తరహాలో అత్యుత్తమ గణాంకాలను నమోదు చేయడం ఐదోసారి మాత్రమే. 1909లో తొలిసారి ఇంగ్లండ్ బౌలర్లు జార్జ్ హిస్ట్-కొలిన్ బ్లైత్‌లు ఇలా ఒకే తరహాలో బెస్ట్ గణాంకాలను నమోదు చేశారు. ఆసీస్‌తో జరిగిన ఆనాటి మ్యాచ్‌లో ఇరువురూ తలో ఐదు వికెట్లు సాధించి చెరో 58 పరుగులిచ్చారు. ఈ ఒకే తరహా అత్యుత్తమ బౌలింగ్ గణాంకాల జాబితాలో భారత బౌలర్లు ఎవరూ లేకపోవడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment