
న్యూఢిల్లీ: ఇంగ్లండ్ ఆల్ రౌండర్, వైస్ కెప్టెన్ బెన్ స్టోక్స్‌కు దూకుడు ఎక్కువే. గతంలో ఓ వ్యక్తిపై దాడి చేసిన ఘటనలో స్టోక్స్ చాలాకాలం ఇంగ్లండ్ జట్టుకు దూరమయ్యాడు. అటు మైదానంలో ప్రత్యర్థి ఆటగాళ్లను స్లెడ్జ్ చేయడంలో సైతం ముందు వరుసలో ఉంటాడు స్టోక్స్. మరి ఈసారి సహచర ఆటగాడు స్టువర్ట్ బ్రాడ్‌తోనే ‘వార్’కు దిగాడు. అసలు ఏ కారణం చేత గొడవ ఆరంభమైందో కచ్చితంగా తెలీదు కానీ వీరిద్దరూ ‘నువ్వెంత అంటే నువ్వెంత’ అనే స్థాయిలో తమ నోటికి పనిచెప్పారు. ఒక జట్టులో ఉన్న ఆటగాళ్ల మధ్య వాగ్వాదం జరిగిన సంఘటనలు చాలా అరుదనే చెప్పాలి. ఒక విషయంలో అభిప్రాయ భేదాలు వచ్చిన క్రమంలో ఎవరూ తగ్గకపోతేనే ఒకే జట్టులో ఉన్న ఆటగాళ్లు మాటల యుద్ధానికి తెరలేపుతారు. ఇప్పుడు స్టోక్స్-బ్రాడ్‌ల మధ్య అదే జరిగినట్లు తెలుస్తోంది. దక్షిణాఫ్రికాతో టెస్టులో భాగంగా శనివారం మూడో రోజు ఆటలో ఇంగ్లండ్ ఆటగాళ్లంతా బ్రేక్ సమయంలో ఉండగా స్టోక్స్‌ను బ్రాడ్ ఏదో అన్నట్లు వీడియోలో కనిపించింది.
అంతకుముందు స్టోక్స్ ఏదో అనడంతోనే బ్రాడ్ కలగజేసుకున్నాడా.. లేక వీరి మధ్య కోల్డ్ వార్ ఏమైనా జరుగుతుందా తెలీదు కానీ చివరకు జో రూట్, జోస్ బట్లర్‌లు కలగజేసుకుని ఆ గొడవను సద్దుమణిగేలా చేశారు. అయితే అది కామెంటరీ బాక్స్‌లో ఉన్న మాజీల నోటికి పని చెప్పింది. దీనిపై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ నాసిర్ హుస్సేన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ‘ ప్రస్తుతం ఉన్న వాతావరణంలో ఇంగ్లండ్ క్రికెటర్లు వేడిగా ఉన్నారు. ఇది మంచి పరిణామం కాదు. నిజాయితీగా చెప్పాలంటే వీరి మధ్య మాటల యుద్ధం జరిగినట్లు కనిపిస్తోంది. ఇద్దరికీ ఏమైనా సమస్యలు ఉండవచ్చు. మనకు బ్రాడ్ ఏదో అనడం.. అదే స్థాయిలో స్టోక్స్ రిప్లై ఇవ్వడం కనిపిస్తోంది. దీని గురించి చర్చ అనవసరం’ అని నాసిర్ హుస్సేన్ పేర్కొన్నాడు. ‘ వీరిద్దరూ స్నేహపూర్వక వాతావరణంలో వ్యాఖ్యలు చేసుకున్నట్లు కనిపించలేదు’ అని వెస్టిండీస్ దిగ్గజం మైకేల్ హోల్డింగ్ అన్నాడు. కాకపోతే అసలు అది ఎందుకు మొదలైందో తెలియక పోయినా, దానికి ముగింపు ఉంటుందని పేర్కొన్నాడు. స్టోక్స్-బ్రాడ్‌ల వాగ్వాదం వీడియో వైరల్ అయ్యింది.
What did I miss? pic.twitter.com/0xWqxQv5Gw
— Kourageous ✨✨✨ (@AN_EVILSOUL) December 28, 2019
Comments
Please login to add a commentAdd a comment