పట్టుదలే పరుగెత్తించింది
50 ఏళ్ల తర్వాత మళ్లీ బోస్టన్ మారథాన్ పూర్తి చేసిన కేథరిన్
1967... అలనాడు అడ్డుకున్నారు... అమ్మాయిలకు మారథాన్‌లో ప్రవేశం లేదన్నారు... ఎలాగైనా పరుగెత్తాలన్న ఆశ... బరిలోకి దిగితే పక్కకు నెట్టేశారు... కానీ... ఆమె మారథాన్‌ను పూర్తి చేసింది. 20 ఏళ్లప్పుడు ఉన్న పట్టుదలే 70 ఏళ్లప్పుడు మళ్లీ పరుగెత్తించింది. ఆమె... కేథరిన్ స్విట్జెర్. 50 ఏళ్ల తర్వాత తన పరుగు ముచ్చట మరోసారి తీర్చుకుంది. 1967లోనే మహిళలకు సమాన హక్కులనే పోరాటం చేసిన కేథరిన్ అమెరికాలో ప్రతిష్టాత్మక బోస్టన్ మారథాన్‌లో పరుగు పెట్టేందుకు స్విట్జెర్ పేరుతో లింగ ప్రస్తావన లేకుండా అర్హతలన్నీ పూర్తిచేసింది. ఇక మిగిలింది ఫైనల్ మారథాన్ రేస్. ఆశల పల్లకిలో స్విట్జర్... కుతూహలంకొద్దీ బరిలోకి... ప్చ్..! పరుగు మొదలైన కాసేపటికే నిలువరింత..! నీకు ఆ చాన్సేలేదన్నా... ఆమె ఆశలపై నీళ్లు చల్లినా... బెదరలేదు. సంకల్పం గట్టిగా ఉంటే సాధన సులభమవుతుందని తన పరుగుతో చాటి చెప్పింది కేథరిన్!
2017... కాలచక్రం గిర్రున తిరిగి యాభై ఏళ్లయింది. సోమవారం బోస్టన్ మారథాన్ ఫైనల్ రేసు జరిగింది. అమెరికా రన్నర్ కేథరిన్ మళ్లీ బరిలోకి దిగింది. ఇందులో పరుగందుకున్న 70 ఏళ్ల కేథరిన్ మొత్తం 42.195 కిలోమీటర్ల పరుగును 4 గంటల 44 నిమిషాల 31 సెకన్లలో పూర్తి చేసింది. తన వయసు కేటగిరీలో 8వ స్థానంలో నిలిచింది. 120 ఏళ్ల చరిత్ర కలిగిన బోస్టన్ మారథాన్‌ను పూర్తి చేసిన అలనాటి తొలి మహిళగా మరోసారి రికార్డులకెక్కింది. ఈ మారథాన్‌లో 1972 నుంచి అధికారికంగా మహిళలకు ప్రవేశం కల్పించారు.
నాడు కేథరిన్‌నుఅడ్డుకుంటున్న నిర్వాహకులు
భారతీయుడి ఘనత...
ఇదే మారథాన్‌లో బెంగళూరుకు చెందిన సాగర్ బహేతి కూడా రికార్డులకెక్కాడు. పాక్షిక అంధత్వమున్న సాగర్ ఈ రేసును 4 గంటల 14 నిమిషాల 7 సెకన్లలో పూర్తిచేసి 18వ స్థానంలో నిలిచాడు. కేవలం ఒక మీటర్ దూరమే చూడగలిగే సాగర్ మారథాన్ లక్ష్యంపై గురిపెట్టడం విశేషం. దీంతో రేసు పూర్తి చేసిన తొలి భారతీయ అంధ రేసర్‌గా అతను ఘనతకెక్కాడు. తమ కుమారుడి పరుగును ప్రోత్సహించేందుకు అతని తల్లిదండ్రులు విష్ణుకాంత, నరేశ్ బహేతి భారత్ నుంచి అమెరికా వెళ్లారు.