
హైదరాబాద్: ప్రభుత్వంతోపాటు అన్ని వర్గాల ప్రజల సహకారంతోనే హైదరాబాద్‌లో అమెరికా దౌత్య కార్యాలయం ద్వారా మెరుగైన సేవలు అందిస్తున్నామని యూఎస్ కాన్సులేట్ జనరల్ కేథరీన్ హడ్డా అన్నారు. నగరంలో దౌత్య కార్యాలయం ఏర్పాటు చేసి పదేళ్లు పూర్తయిన సందర్భంగా అమీర్ పేట మెట్రోరైలు స్టేషన్‌లో బుధవారం ఫొటో ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేశారు. మెట్రోరైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డితో కలసి ఆమె ప్రదర్శనను ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ.. అప్పటి అమెరికా అధ్యక్షుడు జార్జిబుష్, అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డితో కలిసి రాష్ట్రంలో పర్యటించిన ఫొటోలు ప్రదర్శనలో ఆకర్షణగా నిలిచాయని అన్నారు.
ఎన్వీఎస్ రెడ్డి మాట్లాడుతూ.. 2006 సంవత్సరంలో నగర పర్యటనకు వచ్చిన జార్జిబుష్ హైదరాబాద్‌లో దౌత్య కార్యాలయ ఏర్పాటుకు హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఈ ఫొటో ప్రదర్శన రెండు రోజుల పాటు ఉంటుందని తెలిపారు.