
ఈడెన్‌కు పండగ
సాక్షి క్రీడావిభాగం
మైదానంలో దాదాపు లక్ష మంది ప్రేక్షకులతో అపరిమిత జోష్... ఆటంటే ప్రాణమివ్వడంతో పాటు కొన్ని సార్లు అదుపు తప్పే అభిమానం...రికార్డులు, బ్రేక్‌లు, సంచలనాలు, విజయాలు, వివాదాలు...చారిత్రక ఘట్టాలకు, అనేక మైలురాళ్లకు సాక్షి... ఆటగాళ్లపై బెంగాలీ రసగుల్లాలాంటి ఆప్యాయత, ఆదరణ... ఇవన్నీ కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్‌తో విడదీయలేని విశేషాలు. ఆ మైదానంలో కనీసం ఒక మ్యాచ్ అయినా ఆడాలని అనేక మంది యువ ఆటగాళ్లు కలలు కంటారు.
ఒక్కసారైనా ఆ మైదానంలో ప్రేక్షకుల జోరును ఆస్వాదించాలని చాలా మంది అనుకుంటారు. అలాంటి చరిత్ర ఉన్న ఈడెన్ గార్డెన్స్ ఇప్పుడు 150 ఏళ్లు పూర్తి చేసుకోనుంది. ఈ నేపథ్యంలో ఉత్సవాలని ఘనంగా నిర్వహించాలని క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ (క్యాబ్) నిర్ణయించింది.
ఎన్నో విశేషాలు...
1864లో నిర్మించిన ఈ మైదానంలో ఆరంభంలో క్రికెట్‌తో పాటు ఫుట్‌బాల్ తదితర క్రీడలన్నీ నిర్వహించేవారు. అయితే ఆ తర్వాత ఇది పూర్తిగా క్రికెట్ స్టేడియంగా మారిపోయింది. 1987 ప్రపంచ కప్ నుంచి 2011 ప్రపంచ కప్ మధ్య కాలంలో చాలా సందర్భాల్లో స్టేడియంలో లక్ష మంది ప్రేక్షకులు హాజరు కావడం చెప్పుకోదగ్గ విశేషం. ముఖ్యంగా తొలి సారి ఫ్లడ్‌లైట్లతో నిర్వహించిన 1993 హీరో కప్‌లోనైతే ప్రేక్షకులు రికార్డు స్థాయిలో పోటెత్తారు. అయితే వరల్డ్ కప్ కోసం పునరుద్ధరణ పనులతో స్టేడియం సామర్ధ్యం దాదాపు 67 వేలకు తగ్గింది.
ఇక్కడే 2001లో ఆస్ట్రేలియాతో టెస్టులో 281 పరుగులు చేసి వీవీఎస్ లక్ష్మణ్ మ్యాచ్ గెలిపించడం మైదానాన్ని చిరస్మరణీయం చేసింది. అయితే 1966, 69, 96, 99లలో ప్రేక్షకులు మ్యాచ్‌లకు అంతరాయం కలిగించడం కోల్‌కతాకు చెడ్డ పేరు తెచ్చి పెట్టింది కూడా. అయితే ఇదంతా కూడా ఆటపై వారి అపరిమిత అభిమానానికే ఉదాహరణ అంటూ చాలా మంది ఈడెన్ గురించి గొప్పగా చెప్పుకుంటారు. రోమ్‌లోని కలోసియం తరహా శైలితో ఈ స్టేడియాన్ని నిర్మించారు.
పలు కార్యక్రమాలు...
ఈ గురువారం ఈడెన్‌లో భారత్, శ్రీలంక మధ్య నాలుగో వన్డే జరగనుంది. ఈ సందర్భంగా 150 సంవత్సరాల వేడుకలు ‘క్యాబ్’ ఘనంగా నిర్వహిస్తోంది. ఇక్కడ భారత్‌కు తొలి విజయం అందించిన బోర్డే, దురానీలను ఇప్పటికే సన్మానించారు. ఈడెన్ గార్డెన్స్ - లెజెండ్స్ ఆఫ్ రొమాన్స్ పేరుతో రూపొందించిన పుస్తకం కూడా విడుదలైంది. మైదానంపై 12 నిమిషాల ప్రత్యేక డాక్యుమెంటరీని కూడా తయారు చేశారు.
వన్డే రోజున పలువురు మాజీ ఆటగాళ్లను కూడా ఘనంగా సత్కరించడంతో ప్రత్యేక పోస్టల్ స్టాంప్ విడుదల చేసే అవకాశం ఉంది. మరో వైపు మంగళవారం ఎంఏకే పటౌడీ స్మారకోపన్యాసానికి కూడా కోల్‌కతా వేదిక కానుంది. ఈడెన్‌కు ప్రియమైన వీవీఎస్ లక్ష్మణ్ ఈ సారి ప్రసంగించనుండటం విశేషం.