సిడ్నీ: స్వదేశంలో మంచి రికార్డు కలిగి ఉన్న ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు విదేశాల్లో మాత్రం ఇంకా చాలా నిరూపించుకోవాల్సిన అవసరం ఉందని కెప్టెన్ స్టీవ్ స్మిత్ స్పష్టం చేశాడు. ఆస్ట్రేలియాలో కాకుండా బయట ఆడేటప్పుడే తమకు అసలైన సవాల్ ఎదురవుతూ ఉంటుందన్నాడు. ఈ నెల్లో స్వదేశంలో భారత్ తో జరిగే వన్డే, ట్వంటీ 20 సిరీస్ అనంతరం తాము న్యూజిలాండ్ పర్యటనకు వెళుతున్న విషయాన్ని స్మిత్ ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నాడు.
'స్వదేశంలో జరిగే మ్యాచ్ ల్లో ఆసీస్ కు మంచి రికార్డు. విదేశాల్లో ఇంకా పరిణతి చెందాలి. ఆసీస్ కు బయట ఆడినప్పుడలా.. అది మాకు ఛాలెంజ్గానే ఉంటుంది. కివీస్ లో పరిస్థితులకు, ఆస్ట్రేలియాలోని పరిస్థితులకు చాలా వ్యత్యాసం ఉంటుంది. అయినప్పటికీ మా జట్టులోని ఆటగాళ్లపై నమ్మకం ఉంది. న్యూజిలాండ్ పర్యటనను విజయవంతంగా ముగిస్తాం' అని స్మిత్ పేర్కొన్నాడు. ఇటీవల వెస్టిండీస్ తో జరిగిన మూడు టెస్టుల సిరీస్ ను ఆస్ట్రేలియా 2-0 తేడాతో గెలిచిన సంగతి తెలిసిందే.