వావ్రింకాదే టైటిల్
రన్నరప్‌గా పేస్ జంట చెన్నై ఓపెన్
చెన్నై: ఎలాంటి సంచలనాలకు తావివ్వకుండా ఆద్యంతం నిలకడగా ఆడిన స్విట్జర్లాండ్ టెన్నిస్ స్టార్ స్టానిస్లాస్ వావ్రింకా చెన్నై ఓపెన్ టైటిల్‌ను నిలబెట్టుకున్నాడు. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగిన అతను ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో 6-3, 6-4తో ‘క్వాలిఫయర్’ అల్జాజ్ బెడెన్ (స్లొవేనియా)పై విజయం సాధించాడు.
ఫైనల్ చేరే క్రమంలో ముగ్గురు సీడెడ్ క్రీడాకారులను ఓడించిన బెడెన్ టైటిల్ పోరులో మాత్రం వావ్రింకా ధాటికి నిలువలేకపోయాడు. మరోవైపు పురుషుల డబుల్స్ ఫైనల్లో టాప్ సీడ్ లియాండర్ పేస్ (భారత్)-రావెన్ క్లాసెన్ (దక్షిణాఫ్రికా) జంట 3-6, 6-7 (4/7)తో యెన్ సున్ లూ (చైనీస్ తైపీ)-జేమీ ముర్రే (బ్రిటన్) చేతిలో ఓడిపోయి రన్నరప్‌గా నిలిచింది.