
నాటింగ్‌హామ్: వెస్టిండీస్ విధ్వంకసర ఆటగాడు, యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ మరో రికార్డు సృష్టించాడు. ఇప్పటివరకు ఐసీసీ వన్డే ప్రపంచకప్‌లో అత్యధిక సిక్సర్లు(39) కొట్టిన ఆటగాడిగా నయా రికార్డు సృష్టించాడు. ప్రపంచకప్ 2019లో భాగంగా స్థానిక ట్రెంట్ బ్రిడ్జ్‌లో పాకిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఈ ఘనత అందుకున్నాడు. పాక్ బౌలర్ హసన్ అలీ వేసిన నాలుగో ఓవర్‌లో వరుసగా రెండు సిక్సర్లు కొట్టి దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు డివిలియర్స్(37) పేరిట ఉన్న అత్యధిక సిక్సర్ల రికార్డును గేల్ అధిగమించాడు.
ఇప్పటివరకు ప్రపంచకప్‌లలో అత్యధిక సిక్సర్లు కొట్టిన జాబితాలో రికీ పాంటింగ్(31), బ్రెండన్ మెకల్లమ్(29), హెర్షల్ గిబ్స్(28), జయసూర్య, సచిన్ టెండూల్కర్(27)లు తరువాతి స్థానాల్లో ఉన్నారు. అంతేకాకుండా ఈ మ్యాచ్‌లో అర్ద సెంచరీ సాధించడంతో వన్డేల్లో వరుసగా ఆరో అర్దసెంచరీ సాధించిన ఎనిమిదో ఆటగాడిగా రికార్డులకెక్కాడు. ఈ జాబితాలో వరుసగా అత్యధిక అర్దసెంచరీలు సాధించిన ఆటగాడిగా మియాందాద్(9) తొలి స్థానంలో ఉన్నాడు. ఇక ఇదే ఊపులో గేల్ మరో రికార్డుపై కన్నేశాడు. ప్రపంచకప్‌లో విండీస్ దిగ్గజం లారా (1,225) చేసిన పరుగుల్ని గేల్ (944) అధిగమించే అవకాశముంది.
Comments
Please login to add a commentAdd a comment