
'గేల్ ప్రవర్తన ఆశ్చర్యపరచలేదు'
మెల్ బోర్న్:ఆస్ట్రేలియాలో జరుగుతున్న బిగ్ బాష్ లీగ్ సందర్భంగా మహిళా జర్నలిస్టుతో అసభ్యంగా ప్రవర్తించి చిక్కుల్లో పడ్డ విండీస్ స్టార్ ఆటగాడు క్రిస్ గేల్ ప్రవర్తన తనను పెద్దగా ఏమీ ఆశ్చర్యపరచలేదని వెటరన్ ఆల్ రౌండర్ షేన్ వాట్సన్ అభిప్రాయపడ్డాడు. కాగా, అతిగా ప్రవర్తించటం వల్లే గేల్ వివాదాన్ని నెత్తిన ఎత్తుకున్నాడన్నాడు. 'నాకు చాలా కాలం నుంచి గేల్ తెలుసు. నా సమకాలీన క్రికెటర్లలో గేల్ ఒకడు. మేమిద్దరం వ్యతిరేకంగా చాలా మ్యాచ్ లు ఆడాం. నిజంగా చెప్పాలంటే గేల్ ఆ రకమైన ప్రవర్తన ఊహించిందే'అని వాట్సన్ స్పష్టం చేశాడు.
అటు ఆటతోపాటు మరికొన్ని విషయాల్లో కూడా గేల్ ఎప్పుడూ వార్తల్లో ఉంటాడని.. అయితే సందర్భం కాని సమయంలో గేల్ ఇబ్బందుల్ని కొనితెచ్చుకున్నాడన్నాడు. కాగా, గేల్ ను ఆస్ట్రేలియాలో జరిగే మ్యాచ్ ల నుంచి బహిష్కరించాలని యోచిస్తున్న క్రికెట్ ఆస్ట్రేలియాకు వాట్సన్ మద్దతు పలికాడు. ఈ వేసవి కాలమే గేల్ చివరి ఆసీస్ పర్యటన కావచ్చొని పేర్కొన్నాడు. ఇలా క్రికెట్ మైదానం బయట చూసుకోవాల్సిన వ్యవహారాల వల్ల ఆటకు మచ్చ తేకూడదని వాట్సన్ పేర్కొన్నాడు.
ఇటీవల బిగ్ బాష్ లీగ్‌లో భాగంగా హోబార్ట్ హరికేన్స్-మెల్‌బోర్న్ రెనగేడ్స్ మధ్య జరిగిన మ్యాచ్ అనంతరం స్పోర్ట్స్ ప్రజెంటర్ మెలానీ మెక్‌లాఫిలిన్‌తో గేల్ అసభ్యంగా ప్రవర్తించాడు. మ్యాచ్ అనంతరం మెలానీ ఇంటర్వ్యూ చేయడానికి వచ్చిన క్రమంలో గేల్ స్పందిస్తూ 'నువ్వు చేసే ఈ ఇంటర్వ్యూ కోసమే నేను చాలా బాగా బ్యాటింగ్ చేశాను' అని పేర్కొన్నాడు. 'నీ కళ్లు చాలా అందంగా ఉన్నాయి. మ్యాచ్ గెలిచిన తర్వాత మనం కలిసి డ్రింక్స్‌కి వెళ్తామని ఆశిస్తున్నా. మరీ సిగ్గుతో పొంగిపోకు బేబి' అని అసందర్భంగా మాట్లాడాడు. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఆండ్రూ ఫ్లింటాఫ్ కూడా గేల్ తీరును తీవ్రంగా తప్పుబట్టిన సంగతి తెలిసిందే.