అదే తదుపరి లక్ష్యం...
►సుదిర్మన్, థామస్ కప్‌లు గెలుస్తాం
►కోచ్ పుల్లెల గోపీచంద్ ఆశాభావం
►సాయిప్రణీత్, శ్రీకాంత్‌పై ప్రశంసలు
హైదరాబాద్: భారత బ్యాడ్మింటన్ ప్రస్తుతం అద్భుత దశలో ఉందని, భవిష్యత్‌లో మరిన్ని పెద్ద విజయాలు సాధించగలమని చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ విశ్వాసం వ్యక్తం చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇటీవల పెద్ద సంఖ్యలో పతకాలు గెలిచామని, మున్ముందు మరింత మెరుగైన ఫలితాలు రాబడతామని ఆయన అన్నారు. సింగపూర్ ఓపెన్ విజేత సాయిప్రణీత్, రన్నరప్‌గా నిలిచిన కిడాంబి శ్రీకాంత్‌లతో పాటు ఇండియా ఓపెన్ చాంపియన్ పీవీ సింధులకు మంగళవారం ఆయన అకాడమీలో అభినందన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా గోపీచంద్ మాట్లాడుతూ ‘భారత షట్లర్లు సాధించిన విజయాల పట్ల సంతృప్తిగా ఉన్నా. అయితే ఇదే జోరు మరింత పెద్ద ఈవెంట్లలో కూడా కొనసాగించాల్సి ఉంది. ఆల్ ఇంగ్లండ్, ప్రపంచ చాంపియన్‌షిప్, ఒలింపిక్స్‌లలో మరింత మెరుగైన ప్రదర్శన రావాలి.
అదే విధంగా టీమ్ ఈవెంట్లు అయిన సుదిర్మన్ కప్, థామస్, ఉబెర్ కప్‌లలో కూడా భారత్ విజయాలు సాధించాల్సి ఉంది’ అని గోపీచంద్ విశ్లేషించారు. కొన్నాళ్ల క్రితం సైనా, సింధు వరుస విజయాలు సాధిస్తున్న సమయంలో పురుషుల విభాగం సంగతేమిటని తనను కొందరు ప్రశ్నించారని, ఇప్పుడు సింగపూర్ ఓపెన్ ఫలితం దానికి సమాధానమని గోపీచంద్ చెప్పారు. సూపర్ సిరీస్ స్థాయి టోర్నీ ఫైనల్లో ఇద్దరు భారతీయులు తలపడాలన్న తన కల నెరవేరిందన్న గోపీచంద్... మొదటిసారి తాను ఫైనల్ ఫలితం గురించి ఆలోచించకుండా ప్రశాంతంగా ఉండగలిగానన్నారు. ప్రతిభ ఉన్నంత మాత్రాన ఫలితాలు రావని, తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుందన్న కోచ్... సాయిప్రణీత్ తన టైటిల్ విజయానికి ముందు రెండు నెలల పాటు కఠోర సాధన చేసిన విషయాన్ని గుర్తు చేశారు.
ఫిట్‌నెస్‌పైనే దృష్టి...
‘సింగపూర్’ విజయం తనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచిందని, మున్ముందు ఫిట్‌నెస్‌పై మరింత దృష్టి పెడతానని సాయిప్రణీత్ వ్యాఖ్యానించాడు. ‘సూపర్ సిరీస్ స్థాయి విజయం ఎప్పుడైనా మధురమే. దీని కోసం చాలా కాలంగా కలగన్నాను. రాబోయే ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కూడా సత్తా చాటుతా. నా ఫిట్‌నెస్‌లో ఎలాంటి లోపం లేకుండా శ్రమిస్తా. ఇటీవలి కాలంలో నాతో పాటు పురుషుల విభాగంలో సమీర్ వర్మ, అజయ్ జయరామ్ కూడా నిలకడగా ఆడుతున్నారు. ఇది మంచి పరిణామం’ అని ప్రణీత్ అన్నాడు.
ప్రణీత్‌తో తనకు పదేళ్లుగా స్నేహం ఉందని, ఫైనల్లో ఓడటం తనకు నిరాశ కలిగించలేదని శ్రీకాంత్ చెప్పాడు. ‘సింగపూర్‌లో ప్రేక్షకులంతా భారత్ గెలిచింది అంటూ హోరెత్తించడమే నాకు గుర్తుంది.
నేను ఓడినా మనవాడే గెలవడం ఆనందకరం. గత కొంత కాలంగా నా ప్రదర్శనతో పోలిస్తే ఈ ఫైనల్ ప్రదర్శనతో సంతృప్తిగా ఉన్నా’ అని శ్రీకాంత్ పేర్కొన్నాడు. పురుషుల విభాగంతో తనను తాను పోల్చుకోవడం లేదన్న సింధు... ఇండియా ఓపెన్ గెలుపు కూడా తనకు ప్రత్యేకమైందని వెల్ల డించింది. ఈ సందర్భంగా ఈ ముగ్గురు ఆటగాళ్లతో పాటు అంతర్జాతీయ స్థాయిలో నిలకడగా రాణిస్తున్న పలువురు భారత షట్లర్లకు ఐడీబీఐ ఫెడరల్ ప్రత్యేక నగదు పురస్కారాలు అందించింది. మరోవైపు జూనియర్ స్థాయిలో ఆకట్టుకున్న ఐదుగురు ఆటగాళ్లు గాయత్రి, సామియా, మేఘనా రెడ్డి, కవిప్రియ, వికాస్ యాదవ్‌లకు హైదరాబాద్ బ్యాడ్మింటన్ సంఘం అధ్యక్షుడు చాముండేశ్వరీనాథ్ ప్రోత్సాహక నగదు అందజేశారు.