గ్లాస్గో: అంగరంగ వైభవంగా ప్రారంభమైన కామన్వెల్త్ క్రీడల్లో తొలిరోజు పోటీలు కూడా అంతే స్థాయి హంగామా మధ్య జరిగాయి. గురువారం జరిగిన పలు క్రీడాంశాల్లో ఊహించినట్లుగానే ఇంగ్లండ్, ఆస్ట్రేలియాల మధ్య పోటీ నెలకొనగా.. ఆతిథ్య స్కాట్లాండ్ కూడా పతకాల పరుగును వేగంగా ప్రారంభించింది.
ఆ వెనకే మేమున్నామంటూ భారత అథ్లెట్లు పతకాల కోసం పోటీ పడుతూ నాలుగో స్థానంలో కొనసాగుతున్నారు. తొలిరోజు జరిగిన పలు పోటీల్లో ఇంగ్లండ్ 4 స్వర్ణాలతో సహా మొత్తం 12 పతకాలతో అగ్రస్థానంలో కొనసాగుతూ హవా ప్రదర్శిస్తోంది. స్కాట్లాండ్ అనూహ్యంగా చివర్లో మూడు స్వర్ణాలతో రెండో స్థానానికి దూసుకొచ్చింది. ఆస్ట్రేలియా 9 పతకాలతో మూడో స్థానంలో ఉంది.
తొలుత ట్రయథ్లాన్‌లో సాధించిన స్వర్ణంతో బోణీ కొట్టిన ఇంగ్లండ్.. ఆ ఈవెంట్‌లో పురుషుల విభాగంలోనూ పసిడిని దక్కించుకుంది. సైక్లింగ్‌లో ఒకే స్వర్ణం గెలుచుకోగలిగినా.. ఆ క్రీడాంశంలో మొత్తం నాలుగు పతకాలను సొంతం చేసుకుంది. హాకీలో జరిగిన ప్రిలిమినరీ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా మిహ ళల జట్టు ఏకంగా 16-0 తేడాతో ట్రినిడాడ్ అండ్ టొబాగోపై ఘన విజయం సాధించింది.