
రాజస్తాన్, పంజాబ్ మ్యాచ్‌లో బట్లర్ ఔట్ కొత్త వివాదాన్ని రేపింది. ఇన్నింగ్స్ 13వ ఓవర్ చివరి బంతికి ఈ ఘటన జరిగింది. బట్లర్‌ను అశ్విన్ ‘మన్కడింగ్’ ద్వారా ఔట్ చేయడమే దీనికి కారణం. అశ్విన్ బంతి వేయబోయే సమయానికే బట్లర్ క్రీజ్ వదిలి కాస్త ముందుకు వచ్చాడు. దాంతో వెంటనే చేతిని వెనక్కి తీసుకున్న అశ్విన్ బెయిల్స్‌ను పడగొట్టి అప్పీల్ చేశాడు. థర్డ్ అంపైర్ కూడా దానిని ఔట్‌గానే ప్రకటించడంతో బట్లర్ వెనుదిరగాల్సి వచ్చింది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య తీవ్ర వాదోపవాదం కూడా చోటు చేసుకుంది.
నిబంధనల (రూల్ 41.16) ప్రకారమైతే థర్డ్ అంపైర్ చేసింది సరైందే. కానీ సుదీర్ఘ కెరీర్‌లో ‘జెంటిల్‌మన్’గా గుర్తింపు ఉన్న అశ్విన్... ఎలాగైనా వికెట్ తీయాలనే ప్రయత్నంలో ఇలా చేయడం అందరినీ ఆశ్చర్యపరచింది. బంతిని వేసేందుకు ముందుకు వచ్చిన అశ్విన్ భుజాల వరకు చేతిని తెచ్చి అర క్షణం ఆగినట్లు రీప్లేలో కనిపించింది. బట్లర్ క్రీజ్ దాటేవరకు కావాలనే అతను వేచి చూసినట్లు అనిపించింది. ఇదే ఇప్పుడు తీవ్ర విమర్శలకు కారణమై అశ్విన్ క్రీడా స్ఫూర్తిని ప్రశ్నించేలా చేసింది.
‘‘మన్కడింగ్ ఘటనపై అసలు చర్చే అనవసరం. అదేమీ కావాలని చేసింది కాదు. అలా జరిగిపోయిందంతే. నా బౌలింగ్ యాక్షన్ పూర్తి కాకముందే అతను క్రీజ్ వదిలాడు. ఈ విషయంలో నేను స్పష్టంగా ఉన్నా. ఇలాంటి చిన్న చిన్న విషయాలే మ్యాచ్‌ను మలుపు తిప్పుతాయి కాబట్టి బ్యాట్స్‌మన్ జాగరూకతతో ఉండటం అవసరం.’’
–అశ్విన్, పంజాబ్ కెప్టెన్
Comments
Please login to add a commentAdd a comment