
‘బ్యాలెన్స్’ తప్పారు!
తేలిపోయిన భారత బౌలర్లు
తొలి రోజు ఇంగ్లండ్ 247/2
ఆకట్టుకున్న బ్యాట్స్‌మెన్
బ్యాలెన్స్ సెంచరీ, శతకం కోల్పోయిన కుక్
గాయం కారణంగా చివరి నిమిషంలో ఇషాంత్ దూరం కావడం... భువనేశ్వర్ గతి తప్పడం... షమీకి బంతిపై పట్టు చిక్కకపోవడం... పంకజ్ సింగ్‌కు అనుభవం లేకపోవడం... వెరసి సౌతాంప్టన్ టెస్టులో తొలి రోజు ఆదివారం భారత బౌలర్లు ‘బ్యాలెన్స్’ తప్పారు. ఏ దశలోనూ మనవాళ్లు ఆధిపత్యం ప్రదర్శించలేకపోయారు. ఒక్క స్పెల్‌లో కూడా ప్రత్యర్థిని భయపెట్టలేకపోయారు.
మరోవైపు వరుసగా పది టెస్టుల్లో గెలుపు లేదు... బ్యాట్స్‌మన్‌గా ఘోర వైఫల్యం... కెప్టెన్సీకి పనికి రాడంటూ అన్ని వైపుల నుంచి విమర్శలు... ఈసారి విఫలమైతే ఇంటికే అన్నట్లుగా మెడపై కత్తి వేలాడుతోంది. ఇలాంటి స్థితిలో అలిస్టర్ కుక్ నిలబడ్డాడు. జీవన్మరణ సమస్యలా పోరాడి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. యువ ఆటగాడు బ్యాలెన్స్ కెప్టెన్‌కు అండగా నిలిచాడు. వరుసగా రెండో టెస్టులోనూ శతకం సాధించి సత్తా చాటాడు.
సౌతాంప్టన్: లార్డ్స్ టెస్టు పరాభవం నుంచి ఇంగ్లండ్ జట్టు కోలుకుంది. ఆదివారం భారత్‌తో ఇక్కడి రోజ్‌బౌల్ మైదానంలో ప్రారంభమైన మూడో టెస్టులో ఆ జట్టు స్ఫూర్తిదాయక ఆటతీరుతో శుభారంభం చేసింది. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 2 వికెట్ల నష్టానికి 247 పరుగులు చేసింది. గ్యారీ బ్యాలెన్స్ (204 బంతుల్లో 104 బ్యాటింగ్; 15 ఫోర్లు) అజేయ సెంచరీ సాధించగా... వరుస వైఫల్యాల నుంచి కోలుకున్న కెప్టెన్ అలిస్టర్ కుక్ (231 బంతుల్లో 95; 9 ఫోర్లు) సెంచరీ కోల్పోయాడు. ప్రస్తుతం బ్యాలెన్స్‌తో పాటు బెల్ (16 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నాడు. భారత బౌలర్లలో షమీ, జడేజా ఒక్కో వికెట్ పడగొట్టారు.
ఆ క్యాచ్ పట్టుంటే...
ఈ మ్యాచ్‌తో టెస్టుల్లో అరంగేట్రం చేసిన భారత బౌలర్ పంకజ్ సింగ్ తొలి వికెట్ సాధించే అవకాశాన్ని జడేజా వమ్ము చేశాడు. పంకజ్ వేసిన మూడో ఓవర్ తొలి బంతి ఆఫ్ స్టంప్‌పై పడింది. దానిని ఆడలేక కుక్ స్లిప్స్ వైపు ఎడ్జ్ ఇచ్చాడు. అయితే మూడో స్లిప్‌లో ఉన్న జడేజా ఈ సునాయాస క్యాచ్‌ను విడిచిపెట్టాడు. బంతి చేతుల్లోకి వచ్చినా దానిని వదిలేశాడు. ఆ సమయంలో కుక్ స్కోరు 15 పరుగులు. ఆ తర్వాత ఇంగ్లండ్ కెప్టెన్ తన స్కోరుకు మరో 80 పరుగులు జోడించాడు. కుక్ క్యాచ్ పట్టి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదేమో!
తొలి సెషన్: కెప్టెన్ గట్టెక్కాడు
భువనేశ్వర్ వేసిన ఇన్నింగ్స్ తొలి బంతి ఆఫ్‌స్టంప్‌పై అద్భుతంగా స్వింగ్ అయింది. కుక్ బ్యాట్‌కు తగిలినా... స్లిప్ ఫీల్డర్‌కు కాస్త ముందు పడింది. అంతే... ఆ తర్వాత తొలి రోజు భారత్ బంతిపై పట్టు కోల్పోయింది. పంకజ్ బౌలింగ్‌లో జడేజా క్యాచ్ వదిలేయడం మినహా ఎలాంటి డ్రామా చోటు చేసుకోలేదు. లైఫ్ దక్కించుకున్న కుక్, రాబ్సన్‌తో కలిసి మెల్లగా ఇన్నింగ్స్‌ను నడిపించాడు. భారత పేసర్ల బౌలింగ్‌లో పెద్దగా పదును లేకపోవడంతో బ్యాట్స్‌మెన్ సునాయాసంగా పరుగులు సాధించారు. అయితే షమీ బౌలింగ్‌లో జడేజాకు క్యాచ్ ఇచ్చి రాబ్సన్ అవుట్ కావడంతో 55 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెర పడింది.
ఓవర్లు: 29, పరుగులు: 78, వికెట్లు: 1
రెండో సెషన్: నిలకడ
లంచ్ తర్వాత కుక్ మరింత ఆత్మవిశ్వాసంతో బ్యాటింగ్ చేశాడు. మరోవైపు బ్యాలెన్స్ కూడా ధాటిగా ఆడటంతో ఇంగ్లండ్ జోరు పెంచింది. ఈ క్రమంలో 98 బంతుల్లో కుక్ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 9 ఇన్నింగ్స్‌ల తర్వాత కుక్‌కు ఇదే తొలి అర్ధ సెంచరీ కావడం విశేషం. భారత్ ఫీల్డింగ్ లోపాలు కూడా ఇంగ్లండ్‌కు కలిసొచ్చాయి. 68 పరుగుల వద్ద కుక్‌ను రనౌట్ చేసే అవకాశం వచ్చినా... షమీ వృథా చేశాడు. అనంతరం 107 బంతుల్లో బ్యాలెన్స్ అర్ధ సెంచరీ పూర్తయింది. బౌలర్లు ఏ మాత్రం ప్రభావం చూపలేకపోవడంతో చూస్తుండగానే ఈ భాగస్వామ్యం వంద పరుగులు దాటింది.
ఓవర్లు: 34, పరుగులు: 108, వికెట్లు: 0
మూడో సెషన్: అదే జోరు
టీ తర్వాత చక చకా ఆడి సెంచరీ దిశగా దూసుకుపోతున్న కుక్‌కు జడేజా బ్రేక్ వేశాడు. లెగ్‌సైడ్‌లో పడిన బంతిని కుక్ షాట్ ఆడబోయాడు. అయితే ఇన్‌సైడ్ ఎడ్జ్ అయిన బంతి ధోని చేతుల్లో పడింది. సెంచరీకి ఐదు పరుగుల ముందు ఇంగ్లండ్ కెప్టెన్ నిరాశగా వెనుదిరిగాడు. కుక్, బ్యాలెన్స్ రెండో వికెట్‌కు 158 పరుగులు జోడించడం విశేషం. ఆ తర్వాత కొద్ది సేపటికే షమీ బౌలింగ్‌లో థర్డ్‌మ్యాన్ దిశగా ఆడి 189 బంతుల్లో బ్యాలెన్స్ కెరీర్‌లో మూడో సెంచరీని అందుకున్నాడు. కొత్త బంతి కూడా భారత్‌కు కలిసి రాలేదు. బ్యాలెన్స్, బెల్ కలిసి మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా రోజును ముగించారు.
ఓవర్లు: 27, పరుగులు: 61, వికెట్లు: 1
స్కోరు వివరాలు
ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: కుక్ (సి) ధోని (బి) జడేజా 95; రాబ్సన్ (సి) జడేజా (బి) షమీ 26; బ్యాలెన్స్ (బ్యాటింగ్) 104; బెల్ (బ్యాటింగ్) 16; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (90 ఓవర్లలో 2 వికెట్లకు) 247
వికెట్ల పతనం: 1-55; 2-213
బౌలింగ్: భువనేశ్వర్ 22-7-58-0; షమీ 18-3-62-1; పంకజ్ 20-3-62-0; రోహిత్ 6-0-21-0; జడేజా 22-6-34-1; ధావన్ 2-0-4-0.