
మెల్‌బోర్న్: ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ అలెస్టర్ కుక్ డబుల్ సెంచరీతో సత్తాచాటాడు. యాషెస్ సిరీస్‌లో భాగంగా ఇక్కడ ఆసీస్‌తో జరుగుతున్న నాల్గో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో కుక్ ద్విశతకం నమోదు చేశాడు. ఫలితంగా తన టెస్టు కెరీర్‌లో ఐదో డబుల్ సెంచరీ సాధించి ద్రావిడ్, గ్రేమ్ స్మిత్‌ల సరసన నిలిచాడు. 361 బంతుల్లో 23 ఫోర్లతో కుక్ డబుల్ సెంచరీ మార్కును చేరాడు. 104 వ్యక్తిగత స్కోరుతో మూడో రోజు గురువారం ఆటను ప్రారంభించిన కుక్ కుదురుగా బ్యాటింగ్ చేశాడు.
ఒకవైపు ఇంగ్లండ్ వికెట్లు పడుతున్నప్పటికీ కుక్ మాత్రం ఆత్మవిశ్వాసంతో ఆడాడు. ఫోర్ కొట్టి డబుల్ సెంచరీని పూర్తి చేసుకున్న కుక్ తన జట్టును పటిష్ట స్థితిలో నిలిపాడు. కుక్ డబుల్ సెంచరీ సాధించిన తరువాత అత్యధిక సార్లు ఈ ఫీట్‌ను సాధించిన జాబితాలో దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు గ్రేమ్ స్మిత్, ద్రావిడ్‌ల సరసన కుక్ నిలిచాడు. ఇదిలా ఉంచితే, అత్యధిక టెస్టు డబుల్ సెంచరీలు సాధించిన ఆటగాళ్లలో బ్రాడ్‌మన్(12సార్లు), తొలి స్థానంలో ఉండగా, సంగక్కరా(11సార్లు) రెండో స్థానంలో , బ్రియాన్ లారా(9) మూడో స్థానంలో, జయవర్థనే (7) నాల్గో స్థానంలో ఉన్నారు.