కోరీ అండర్సన్ వస్తున్నాడు..
వెల్లింగ్టన్: భారత్ తో జరిగే వన్డే సిరీస్లో న్యూజిలాండ్ విధ్వంసకర ఆటగాడు కోరీ అండర్సన్ కు చోటు దక్కింది. కొంతకాలంగా గాయంతో బాధపడుతున్న అండర్సన్ గతవారం ఫిట్ నెస్ ను నిరూపించుకోవడంతో భారత్తో జరిగే ఐదు వన్డేల సిరీస్లో చోటు కల్పిస్తూ న్యూజిలాండ్ క్రికెట్ సెలక్షన్ కమిటీ నిర్ణయం తీసుకుంది. ఇటీవల జింబాబ్వే, దక్షిణాఫ్రికాలో పర్యటించిన న్యూజిలాండ్ జట్టులో కోరీ అండర్సన్ గాయం కారణంగా స్థానం కోల్పోయాడు. అయితే భారత్తో జరిగే వన్డే సిరీస్ కు అండర్సన్ అందుబాటులోకి రావడం పట్ల న్యూజిలాండ్ సెలక్టర్ గావిన్ లార్సన్ హర్షం వ్యక్తం చేశాడు. తమ జట్టులో అండర్సన్ కీలక ఆటగాడంటూ కొనియాడాడు. మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే అండర్సన్ పూర్వవైభవాన్ని చాటుకుంటాడని ఆశిస్తున్నట్లు లార్సన్ పేర్కొన్నాడు.
'కోరీ రాక కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నాం. మిడిల్ ఆర్డర్లో కోరీ మాకు అత్యంత బలం. దాంతో పాటు భారత్లోని పరిస్థితులు బాగా తెలిసిన ఆటగాడు. భారత్ లో సిరీస్లో స్పెషలిస్టు బ్యాట్స్మన్గా ఉపయోగిస్తాం. అండర్సన్ బౌలింగ్ను మెరుగుపరుచుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాడు. అవసరమైన సమయాల్లో బౌలింగ్ ఆయుధం కూడా అండర్సన్ ను బరిలోకి దింపుతాం'అని లార్సన్ తెలిపాడు.