‘రజత’ సీమ
డిస్కస్ త్రోలో రెండో స్థానం
అథ్లెటిక్స్‌లో భారత్‌కు మరో పతకం
కృష్ణ పూనియా విఫలం
వేదిక మారింది. ఫలితం మారింది. నాలుగేళ్ల క్రితం న్యూఢిల్లీ కామన్వెల్త్ గేమ్స్‌లో కాంస్యం నెగ్గిన డిస్కస్ త్రోయర్ సీమా పూనియా (అంటిల్) ఈసారి మరో మెట్టు ఎగబాకింది. గ్లాస్గోలో అద్వితీయ ప్రదర్శనతో రజత పతకం సొంతం చేసుకుంది. మరోవైపు ఢిల్లీ గేమ్స్‌లో స్వర్ణం నెగ్గిన స్టార్ డిస్కస్ త్రోయర్ కృష్ణ పూనియా తీవ్రంగా నిరాశపరిచి ఐదో స్థానంతో సరిపెట్టుకుంది.
గ్లాస్గో: కామన్వెల్త్ గేమ్స్‌లో వరుసగా రెండో రోజు భారత డిస్కస్ త్రోయర్లు రాణించారు. గురువారం పురుషుల విభాగంలో వికాస్ గౌడ పసిడి పతకం నెగ్గగా... శుక్రవారం మహిళల విభాగంలో సీమా పూనియా (అంటిల్) ‘రజత’ దరహాసం చేసింది. మొత్తం 12 మంది పాల్గొన్న ఫైనల్లో సీమా తన ఐదో ప్రయత్నంలో డిస్క్‌ను అత్యధికంగా 61.61 మీటర్ల దూరం విసిరి రెండో స్థానాన్ని దక్కించుకుంది. ఆస్ట్రేలియాకు చెందిన డానీ శామ్యూల్స్ (64.88 మీటర్లు) స్వర్ణం సాధించగా... జేడ్ లాలీ (ఇంగ్లండ్-60.48 మీటర్లు) కాంస్యం సంపాదించింది. నాలుగేళ్ల క్రితం న్యూఢిల్లీలో ఈ క్రీడాంశంలో భారత క్రీడాకారిణులు స్వర్ణ, రజత, కాంస్య పతకాలు నెగ్గి ‘క్లీన్ స్వీప్’ చేశారు.
కానీ ఈసారి మాత్రం అదే ఫలితాన్ని పునరావృతం చేయలేకపోయారు. కచ్చితంగా పతకం సాధిస్తుందనుకున్న కృష్ణ పూనియా నిరాశపరిచింది. మొత్తం ఆరు ప్రయత్నాల్లో ఆమె అత్యుత్తమంగా డిస్క్‌ను 57.84 మీటర్ల దూరం మాత్రమే విసిరింది. ఇక మహిళల హైజంప్‌లో సహనా కుమారి కూడా పతకం నెగ్గలేకపోయింది. ఆమె 1.86 మీటర్ల దూరం ఎత్తుకు ఎగిరి ఎనిమిదో స్థానంతో సంతృప్తి పడింది.
సరిత పంచ్ అదిరింది
60 కేజీల విభాగంలో ఫైనల్లోకి
మహిళల బాక్సింగ్‌లో భారత్‌కు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. 60 కేజీల విభాగంలో లైష్రామ్ సరితా దేవి ఫైనల్లోకి దూసుకెళ్లగా... 51 కేజీల విభాగంలో పింకీ జాంగ్రా సెమీఫైనల్లో ఓడిపోయింది. మరియా మచోంగా (మొజాంబిక్)తో జరిగిన సెమీఫైనల్లో సరిత 3-0 (40-33, 40-32, 40-34)తో విజయం సాధించి స్వర్ణ పతక పోరుకు అర్హత సాధించింది.
మచోంగాతో జరిగిన బౌట్‌లో సరిత ఆద్యంతం ఆధిపత్యం చలాయించింది. ఆరంభం నుంచే ప్రత్యర్థిపై పదునైన పంచ్‌లు సంధిస్తూ ఉక్కిరిబిక్కిరి చేసింది. ఒకదశలో సరిత పంచ్‌లు తాళలేక మచోంగా రింగ్‌లో సరిగ్గా నిలబడలేకపోయింది. రిఫరీ వార్నింగ్ తర్వాత మచోంగా బౌట్‌ను కొనసాగించినా సరిత ధాటికి ఆమె కోలుకోలేకపోయింది. పురుషుల 49 కేజీల సెమీఫైనల్లో దేవేంద్రో సింగ్ 3-0 (30-27, 30-27, 30-27)తో యాష్లే విలియమ్స్ (వేల్స్)పై నెగ్గి ఫైనల్లోకి ప్రవేశించాడు.
పోరాడి ఓడిన పింకీ
మిచెల్లా వాల్ష్ (ఇంగ్లండ్)తో జరిగిన సెమీఫైనల్లో పింకీ 0-2తో ఓడింది. రెండు నిమిషాల వ్యవధిగల నాలుగు రౌండ్స్ గల ఈ బౌట్‌లో పింకీ ప్రతి రౌండ్‌లో గట్టిపోటీనిచ్చినా కీలకదశలో వాల్ష్ పైచేయి సాధించింది. బౌట్‌ను పర్యవేక్షించిన కెనడా, హంగేరి జడ్జిలు 40-36, 39-37 స్కోర్లతో వాల్ష్ వైపు మొగ్గారు. కజకిస్థాన్ జడ్జి మాత్రం ఇద్దరికీ 38-38 పాయింట్లు ఇచ్చింది. సెమీస్‌లో ఓడిన పింకీకి కాంస్య పతకం ఖాయమైంది.
సెమీస్‌లో కశ్యప్, సింధు, గురుసాయిదత్
కామన్వెల్త్ గేమ్స్ బ్యాడ్మింటన్‌లో భారత షట్లర్లు పారుపల్లి కశ్యప్, పి.వి.సింధు, గురుసాయిదత్‌లు సెమీఫైనల్స్‌కు చేరుకున్నారు. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో రెండో సీడ్ సింధు 21-10, 21-9తో అన్నా రంకిన్ (న్యూజిలాండ్)పై అలవోక విజయం సాధించింది.
పురుషుల సింగిల్స్‌లో క్వార్టర్స్‌లో కశ్యప్ 21-13, 21-14తో డారెన్ ల్యూ (మలేసియా)పై గెలుపొందగా, గురుసాయిదత్ 21-15, 8-21, 21-17తో చోంగ్ వీ ఫెంగ్ (మలేసియా) నెగ్గాడు. అయితే కిడాంబి శ్రీకాంత్ 10-21, 21-12, 12-21తో డెరెక్ వాంగ్ (సింగపూర్) చేతిలో, పి.సి.తులసి 21-18, 19-21, 19-21తో జింగ్ యీ టీ (మలేసియా) చేతిలో క్వార్టర్స్‌లో ఓటమిపాలయ్యారు.