స్వర్ణం గురించే ఆలోచించాను...
గ్లాస్గో: నాలుగేళ్ల క్రితం స్వదేశంలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో రజతంతో సంతృప్తి పడిన భారత స్టార్ డిస్కస్ త్రోయర్ వికాస్ గౌడ... స్కాట్లాండ్‌లో మాత్రం అనుకున్నది సాధించాడు. ఐదున్నర దశాబ్దాల సుదీర్ఘ విరామానికి తెరదించుతూ... కామన్వెల్త్ గేమ్స్ అథ్లెటిక్స్ పురుషుల విభాగంలో భారత్‌కు స్వర్ణం అందించిన రెండో అథ్లెట్‌గా గుర్తింపు పొందాడు. గురువారం రాత్రి జరిగిన పురుషుల డిస్కస్ త్రోలో వికాస్ గౌడ డిస్క్‌ను 63.64 మీటర్ల దూరం విసిరి పసిడి పతకం నెగ్గిన సంగతి విదితమే. 1958 కార్డిఫ్ గేమ్స్‌లో మిల్కా సింగ్ స్వర్ణం గెలిచాక... ఈ క్రీడల్లో భారత అథ్లెట్‌కు బంగారు పతకం రావడం ఇదే ప్రథమం.
‘ఈసారి కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం సాధించాలనే ఏకైక ఆలోచన గత ఏడెనిమిది నెలలుగా నా మదిలో మెదులుతోంది. పసిడి నెగ్గడం నాకెంతో ప్రత్యేకంగా అనిపిస్తోంది. ఇక కొన్ని రోజులు సేదతీరుతాను. నాకిష్టమైన భోజనం చేస్తాను’ అని 6 అడుగుల 9 అంగుళాల ఎత్తు, 110 కేజీల బరువున్న 31 ఏళ్ల వికాస్ గౌడ తెలిపాడు. మైసూరులో జన్మించిన వికాస్ ప్రస్తుతం అమెరికాలోని ఆరిజోనాలో నివాసం ఉంటున్నాడు. వికాస్ తండ్రి శివ 1988 సియోల్ ఒలింపిక్స్‌లో భారత అథ్లెటిక్స్ జట్టుకు కోచ్‌గా వ్యవహరించారు.