
మిచెల్.. మళ్లీ క్రికెట్ ఆడాలి!
అడిలైడ్: ఇటీవల అంతర్జాతీయ క్రికెట్ నుంచి వీడ్కోలు పలుకుతూ ఆస్ట్రేలియా క్రికెటర్ మిచెల్ జాన్సన్ తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలనే డిమాండ్ వినిపిస్తోంది. న్యూజిలాండ్ తో జరిగిన రెండో టెస్టు అనంతరం మిచెల్ ఆకస్మికంగా తన రిటైర్మెంట్ నిర్ణయాన్నిప్రకటించాడు. అయితే ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు కోచ్ డారెన్ లీమన్, కెప్టెన్ స్టీవ్ స్మిత్ లు మిచెల్ మళ్లీ ఆడితే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు. ఆ క్రమంలోనే రిటైర్మెంట్ వెనక్కి తీసుకోవాలని కూడా మిచెల్ కు విన్నవించినట్లు వారు పేర్కొన్నారు.
ప్రస్తుతం ఆసీస్ జట్టులో పేస్ బౌలింగ్ లేమి కనబడుతోందని దాన్నిభర్తీ చేయడానికైనా తన నిర్ణయంపై పునరాలోచించుకోవాలని తాజాగా జాన్సన్ ను లీమన్, స్మిత్ లు కోరారు. కనీసం వన్డేల్లోనైనా ఆడాలని మిచెల్ కు విజ్ఞప్తి చేసినట్లు వారు పేర్కొన్నారు. 'మిచెల్ తిరిగి ఆడితే బాగుంటుంది. రిటైర్మెంట్ నిర్ణయంపై పునరాలోచించుకుని జట్టులో కొనసాగితే మంచిదనేది మిచెల్ ను కోరాం. కానీ అతను అందుకు సుముఖంగా లేడు.కేవలం ఇంటి దగ్గర కూర్చుని ఆసీస్ మ్యాచ్ లను చూడాలని అనుకుంటున్నాడు' అని లీమన్, స్మిత్ లు ఓ సంయుక్త ప్రకటనలో తెలిపారు.