
అప్పుడే రిటైర్ కావాలనుకున్నా...
ముంబై: సచిన్ టెండూల్కర్... ప్రపంచ క్రికెట్‌కు ఏమాత్రం పరిచయం అక్కరలేని పేరు. ఓ రకంగా ‘క్రికెట్ దేవుడు’గా అభిమానులు అభివర్ణించే ఆటగాడు. దాదాపు అన్నిరకాల రికార్డులను తన పేరిట లిఖించుకున్న ఈ అద్వితీయ దిగ్గజం నిజానికి చాలాకాలం క్రితమే అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకోవాలని భావించాడట. సచిన్ కెరీర్‌లో దారుణ వైఫల్యమేదైనా ఉంటే అది తను భారత జట్టు కెప్టెన్‌గా వ్యవహరించిన కాలం.
నాయకుడిగా ఘోరంగా విఫలమైన ‘మాస్టర్’ ఆ సమయంలోనే క్రికెట్ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాడట. ఈనెల 6న మార్కెట్లోకి రానున్న సచిన్ ఆత్మకథ ‘ప్లేయింగ్ ఇట్ మై వే’లో ఇలాంటి పలు ఆసక్తికర విషయాలను పొందుపరిచారు. రెండు దశాబ్దాలకు పైగా సాగిన తన కెరీర్‌లో పలు చీకటి రోజులను ఈ సందర్భంగా 41 ఏళ్ల సచిన్ ఆ పుస్తకంలో గుర్తుచేసుకున్నాడు.
కెరీర్ ముగిసిందనుకున్నా: నా సారథ్యంలో వరుసగా ఓటములు రావడంతో అసహ్యం కలిగింది. జట్టు కెప్టెన్‌గా వాటికి నాదే బాధ్యత. ఇంకా దారుణమేమిటంటే ఈ పరిస్థితి నుంచి ఎలా బయటికి రావాలో తెలీకపోవడం. ఎందుకంటే అప్పటికే నా అత్యుత్తమ ఆటతీరును ఆడేందుకు ప్రయత్నిస్తున్నా. ఇక పరాజయాలను ఆపేందుకు నా దగ్గర ఏమీ లేదనే భయం కలిగింది.
ఈ విషయాన్ని నా భార్య అంజలికి కూడా చెప్పాను. గెలవాల్సిన చాలా మ్యాచ్‌లు ఓడిపోవడం భయం కలిగించింది. కనీసం 0.1 శాతం కూడా పోరాడలేననే భావనకు వచ్చాను. ఈ అపజయాల నుంచి కోలుకోవడానికి చాలాకాలం పట్టింది. ఓ దశలో క్రికెట్‌కు పూర్తిగా దూరమైతే ఎలా ఉంటుందనే విషయాన్ని కూడా ఆలోచించాను.
విండీస్ పర్యటన పీడకల: 1997, మార్చి 31.. భారత క్రికెట్ చరిత్రలో ఇది చీకటి రోజే కాకుండా నా కెప్టెన్సీ కెరీర్‌లో కూడా అత్యంత చెత్త రోజుగా భావించవచ్చు. అప్పటికే విండీస్‌తో రెండు టెస్టులు ‘డ్రా’ అయ్యాయి. మూడో టెస్టులో విజయం దిశగా వెళుతున్నాం. 120 పరుగులు చేస్తే చాలు. అయితే రెండో ఇన్నింగ్స్‌లో 81 పరుగులకే ఆలౌటై దారుణంగా ఓడాం. ఈ ఓటమి నన్ను దారుణంగా దెబ్బతీసింది. రెండు రోజుల పాటు గది నుంచి బయటకు రాలేకపోయాను.
ఆటగాళ్లపై అరిచాను: ఇక టెస్టు సిరీసే అనుకుంటే ఆ తర్వాత వన్డే సిరీస్ కూడా 1-4తో ఓడాం. మూడో వన్డేలో చివరి 10 ఓవర్లలో 47 పరుగులు చేస్తే చాలు. చేతిలో ఆరు వికెట్లున్నాయి. భారీ షాట్లకు వెళ్లకుండా నిదానంగా ఆడమని నేను పదేపదే ఆటగాళ్లకు చెబుతూనే ఉన్నాను. అయినా మిడిల్, లోయర్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ అదేపనిగా గాల్లోకి షాట్లు ఆడి పెవిలియన్‌కు చేరారు. విజయం నుంచి ఓటమికి వెళ్లిన పరిస్థితి చూసి తట్టుకోలేకపోయాను. మ్యాచ్ అనంతరం మీటింగ్ ఏర్పాటు చేసి ఆటగాళ్లపై గట్టిగా అరిచాను. ఇలాంటి ఆట సరికాదని సూటిగా చెప్పాను. ఆ తర్వాత నా గదికి కుంబ్లే, శ్రీనాథ్ వచ్చి ఓదార్చారు.